ఆస్పత్రి నుంచి భీమ్ ఆర్మీ చీఫ్ డిశ్చార్జి
X
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో గాయపడ్డారు. వెంటనే ఆయన్ను సుహారన్పుర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం నొప్పి తగ్గడానికి మందులు వాడుతున్నానని.. మరో మూడు రోజుల్లో సాధారణ స్థితికి వస్తానని ఆయన వివరించారు.
రాష్ట్రంలో కులం, మతం ఆధారంగా నేరస్థులకు భద్రత కల్పిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. అంతకుముందు చంద్రశేఖర్ ఆజాద్ ను రెజ్లర్లు, సాక్షిమాలిక్, బజరంగ్ పునియా పరామార్శించారు. దళిత హక్కులు, వారి అభ్యున్నతి కోసం పోరాడుతున్న చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు జరిపి హత్యకు ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో సహారన్‌పూర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఒక కారులో వచ్చిన దుండగులు ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఆయనపై దేవబంద్ ప్రాంతంలో కాల్పులు జరిపి పారిపోయారు. ఒక బుల్లెట్ ఆయన కడుపులోకి దూసుకెళ్లింది. చంద్రశేఖర్ ఆజాద్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.