Parliament Session : పాత పార్లమెంట్ భవనాన్ని ప్రజల కోసం తెరిచే ఉంచుతాం : మోదీ
X
100 ఏళ్ల పార్లమెంట్ పాత భవనానికి వీడ్కోలు పలుకుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్ సభలో ఆయన ప్రసంగించారు. కొత్త భవనంలోకి వెళ్లాక పాత భవనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 75ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకోవాలన్న ప్రధాని.. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ భవనం మున్ముందు ఎన్నెన్నో నేర్పిస్తుందన్నారు. పాత భవనాన్ని ప్రజల సందర్శన కోసం తెరిచే ఉంచుతామని స్పష్టం చేశారు.
1927 జనవరి 18న ఈ పార్లమెంట్ భవనం ప్రారంభమైనట్లు మోదీ చెప్పారు. గత 75 ఏళ్లలో 7500 ఎంపీలు, 17 మంది స్పీకర్లు పనిచేశారన్నారు. భారత్ నిర్మాణాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలన్నారు. పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రజలు చెమటోడ్చి కట్టారని తెలిపారు. రైల్వే ఫ్లాట్ ఫాం నుంచి వచ్చిన వ్యక్తి ఈ సభలో అత్యున్నత స్థానం పొందాడని అన్నారు. ఈ భవనం ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైందని.. ఈ సభలో ఎన్నోసార్లు ఎన్నో భావొద్వేగాలు పంచుకున్నామని చెప్పారు. ఈ భవనంలో నెహ్రూ, అంబేద్కర్ నడిచారని చెప్పారు.
ప్రజాస్వామ్యానికి పాత పార్లమెంట్ సూచికగా నిలుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. G20 సమావేశాలు భారత ప్రతిష్ఠను పెంచాయన్నారు. G20 సమ్మిట్ నిర్వహణపై ప్రపంచదేశాలు భారత్ కీర్తించాయని చెప్పారు. G20 సక్సెస్ ఒక పార్టీకి సంబంధించినది కాదని.. అది ఇండియాది అని అన్నారు. చంద్రయాన్ 3 సక్సెస్తో ప్రపంచానికి భారత సత్తా చాటామన్నారు. ‘‘భారత్ అభివృద్ధి ప్రపంచమంతా ప్రకాశిస్తుంది. నేడు ప్రపంచానికి భారత్ మిత్ర దేశంగా ఉంది. భారతీయ విలువలు, ప్రమాణాలతో ఇది సాధ్యమైంది. డిజిటైలేజేషన్ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది’’ అని మోదీ చెప్పారు.