మళ్లీ బీజేపీతో చేతులు కలపనున్న నితీశ్? అథవాలే వ్యాఖ్యల అర్థమదేనా!
X
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేందుకు బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ చక్కని ఉదాహరణ. అధికారం, పదవులు కోసం అయితే కాంగ్రెస్, లేకపోతే బీజేపీతో ఆయన కలుస్తుంటారు. కొన్నాళ్ల కిందట బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ సారథ్యంలోని ‘మహాఘట్ బంధన్’ లోకి వచ్చిన ఆయన మళ్లీ కూటమి మారతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. పాతికకుపైగా విపక్షాలు ఇటీవలే బెంగళూరులో ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడి, కన్వీనర్ బాధ్యతలను నితీశ్ కుమార్‌కు అప్పగించి, ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెడతారన్న అంచనాల నేపథ్యంలో ఆయన తమ కూటమిలోకి వచ్చే అవకాశముందని ఎన్డీఏ నేతలు అంటున్నారు.
నితీశ్‌కు ఇండియా కూటమి నచ్చడం లేదని, ఆయన ఎప్పుడైనా సరే తమ కూటమిలోకి ఏ క్షణంలోనైనా రావొచ్చని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే శనివారం పట్నాలో అన్నారు. ‘‘ఆయన ఎన్డీఏకు పాతకాపే. నితీష్ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఆయన మాతోనే ఉన్నారు. విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడం ఆయన నచ్చనట్లు తెలుస్తోంది. తర్వాత జరిగే ఇండియా భేటీకి వెళ్లొద్దని కోరుతున్నాను. ఆ కూటమిలో చాలా మంది కన్వీనర్లు, ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి నితీశ్‌కు ప్రాధాన్యం ఉండదు’’ అని అన్నారు. అథవాలే వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ స్పందించారు. నితీశ్ అథవాలేతో ఏదో చెప్పి ఉండొచ్చని అందుకే ఆయన అలా మాట్లాడారని అన్నారు. కాగా, విపక్ష కూటమి ‘ఇండియ’ పేరు పెట్టడంపై తనకు అభ్యంతరం లేదని, అది కలసి తీసుకున్న నిర్ణయమని నితీశ్ ఇదివరకు వివరణ ఇచ్చారు.