క్యాలెండర్లో లేని తేదీలో పుట్టిన బాలుడు.. ఎలా అంటే..?
X
ఆ బాలుడి బర్త్ డే క్యాలెండర్లో కూడా లేదు. క్యాలెండర్లో లేని తేదీలో అతడు పుట్టలేదు. అధికారులు అలా పుట్టించారు. ఆ విద్యార్థి టీసీలో అధికారులు క్యాలెండర్లో లేని డేట్ వేశారు. దీంతో అతడికి మరో స్కూల్లో అడ్మిషన్ దొరకడం లేదు. తప్పును కరెక్ట్ చేయాలని ఆ పిల్లాడు స్కూల్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. బీహార్లో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా నిలుస్తోంది.
జముయీ జిల్లాలోని ఉత్క్రమిత్ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అమన్ కుమార్‌కు సంబంధించిన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌లో ఆ కుర్రాడి పుట్టిన తేదీ 2009 ఫిబ్రవరి30 అని టీచర్లు రాశారు. దీంతో అతడి బర్త్ డే క్యాలెండర్లోనే లేకుండా పోయింది. దీనివల్ల పుట్టినరోజు కారణంగా తమ పిల్లవాడికి 9వ తరగతిలో ఎక్కడా అడ్మిషన్ దొరకడంలేదని అతడి తండ్రి రాజేష్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై అధికారులకు పలుసార్లు విన్నవించినా పట్టించుకోలేదని రాజేష్ యాదవ్ ఆరోపించారు. ఈ విషయమై స్కూల్ హెచ్ఎంని సంప్రదించిన ప్రతీసారీ ఏదో ఒక సాకు చెబుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు తన కుమారుని పుట్టినతేదీ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పుకాదని.. ఆ విద్యార్థి సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌లో అలా ఉండి ఉంటుందని అధికారులు చెప్పి చేతులు దులుపుకున్నారు. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించాలని విద్యార్థికి సూచించారు.