Home > జాతీయం > బిహారీలు తమిళనాడుకు వచ్చి.. డీఎంకే ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

బిహారీలు తమిళనాడుకు వచ్చి.. డీఎంకే ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

బిహారీలు తమిళనాడుకు వచ్చి.. డీఎంకే ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు
X

డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల క్రితం చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హిందీ మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌ కార్మికులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్‌ ఈ ఏడాది మార్చిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ అంశంపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు.

కాగా మార్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని మారన్ అన్నారు. తమిళనాడు ప్రజలు ఆయా భాషలను బాగా నేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌ కంపెనీకి సీఈఓగా ఎదిగాడన్నారు. ఒకవేళ సుందర్‌ పిచాయ్‌ హిందీ నేర్చుకుంటే నిర్మాణ రంగంలో కార్మికుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్‌ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారన్న ఆయన.. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్‌ వాసులు తమిళనాడుకు వలస వచ్చి రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.

దయానిధి మారన్‌ వ్యాఖ్యలను బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని.. పరస్పరం గౌరవించుకుంటేనే సముచితంగా ఉంటుందని తెలిపారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ విమర్శించింది. గతంలో సనాతన ధర్మం, ఇప్పుడు హిందీ మాట్లాడేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడింది.

Updated : 25 Dec 2023 8:15 AM IST
Tags:    
Next Story
Share it
Top