అమానుషం.. డెడ్ బాడీని కాలువలో పడేసిన పోలీసులు.. (వీడియో)
X
బీహార్ లో పోలీసులు దారుణంగా వ్యవహరించారు. చనిపోయిన వ్యక్తి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో స్పాట్లోనే చనిపోయిన వ్యక్తి శవాన్ని హాస్పిటల్ కు తరలించకుండా అక్కడే ఉన్న ఓ కాలువలో పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ముజఫర్ నగర్ జిల్లాలోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఉదయం ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆ బండి నడుపుతున్న డ్రైవర్ ఆగకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. నడిరోడ్డుపై రక్తం మడుగుల్లో మృతదేహం పడి ఉండటం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మానవత్వం మరిచి దారుణంగా వ్యవహరించారు.
ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసి మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించాల్సిన పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. అదంతా చేయడం టైం వేస్ట్ అనుకుని ముగ్గురు పోలీసులు మృతదేహాన్ని అక్కడే ఉన్న వంతెన వద్దకు తీసుకొచ్చారు. డెడ్ బాడీని వంతెన కింద ప్రవహిస్తున్న కాలువలో పడేసి చేతులు దులుపుకున్నారు. పోలీసుల చేసిన పని చూసి అక్కడే ఉన్న జనం షాక్ అయ్యారు. కొందరు ఈ వ్యవహారం మొత్తాన్ని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు మృతదేహాన్ని కాలువలో పడేస్తున్న వీడియో తమ దృష్టికి రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. కాలువలో పడేసిన డెడ్ బాడీని వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.