Home > జాతీయం > రామమందిర్‌కు పోటీగా సీతామందిర్.. సీఎం వ్యూహం అదేనా?

రామమందిర్‌కు పోటీగా సీతామందిర్.. సీఎం వ్యూహం అదేనా?

రామమందిర్‌కు పోటీగా సీతామందిర్.. సీఎం వ్యూహం అదేనా?
X

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరం వచ్చే సంక్రాంతి నాటికి పూర్తికానుంది. మందిర్‌తో తమకు ఓట్లు మరింతగా పోలవుతాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఒకపక్క ఇండియా పేరుగా భారత్‌గా మార్చడంతోపాటు ఐపీసీ చట్టాల పేర్ల మార్పు, జమిలి ఎన్నికలు సహా తన అజెండాలోని అన్ని అంశాలను ఎన్నికల షెడ్యూలు వచ్చేనాటికి పూర్తి చేయాలనుకున్నట్లు కాషాయదళ వ్యవహారాలను చూస్తే అర్థమవుతోంది. ఇంత దూకుడుగా వెళ్తున్న బీజేపీని అడ్డుకోవాడానికి విపక్ష ఇండియా కూటమి కూడా ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే పలుసార్లు భేటీ అయిన కూటమి ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు మత రాజకీయాలను మత రాజకీయాలతో ఎదుర్కొనే పథకాలు రచిస్తోంది. రాముడికి సీతమ్మతో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పుడే ఎందుకు?

బిహార్‌లోని సీతామర్హి జిల్లా పురానా ధామ్‌లో సీతాదేవి మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా పునర్మిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. సీతమ్మ జన్మస్థలంగా భావిస్తున్న ఆ ప్రాంతాన్ని 72.47 కోట్లతో అభివృద్ది చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సీతామర్హిలో జానకి పుట్టినట్టు భావిస్తున్న క్షేత్రానికి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందిపడుతుంటారు. ఇన్నాళ్లూ ఈ అంశాన్ని పట్టించుకోని నితీశ్ ప్రభుత్వం ఎన్నికలకు ఏడెనిమిది నెలల గడువు ఉందనగా అభివృద్ధి ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది. అయోధ్య మందిరంతో బీజేపీ మరింత దూకుడుగా హిందుత్వను ప్రచారం చేస్తుందని, దానికి దీటుగా అదే హిందుత్వకు చెందిన అమ్మవారితో రాజకీయం చేయాలన్నది నితీశ్ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రాజెక్టులో భాగంగా, ‘సీతావాటిక,’, ‘లవకుశ వాటిక’, కఫటేరియా, ల్యాండ్‌స్కేపింగ్, యానిమేషన్ షోలు తదితరాలను ఏర్పాటు చేస్తారు.

చొరవ వెనక?

ఇండియా కూటమి అభ్యర్థిగా నితీశ్‌ను ప్రకటిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. మరోపక్క ప్రధాని రేసులో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. వారిపై పైచేయి సాధించే ఎత్తుగడలో భాగంగా, హిందూ ఓట్లను పోలరైజ్ చేయడానికి నితీశ్ సీతమ్మగుడి పేరుతో రాజకీయాలకు తెరలేపినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగంతోపాటు ప్రజలు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే ప్రభుత్వం గుళ్లపేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.


Updated : 8 Sept 2023 4:07 PM IST
Tags:    
Next Story
Share it
Top