హెల్మెట్ లేకుండా ప్రయాణం.. బైకర్‌కు రూ.3.22 లక్షల జరిమానా
X
పై ఫోటోలో ఉన్న స్కూటీ(బైక్) ని చూశారా?. దాని ఖరీదు కాస్త అటుఇటుగా రూ.40 వేలు ఉండొచ్చు. ఆ స్కూటికి పడిన జరిమానా ఎంతో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవుతారు. రూ.40 వేల విలువ గల ఆ స్కూటికీ రూ. 3.22 లక్షల ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. సదరు స్కూటీ వాహనదారుని నిర్వాకమే ఇంత భారీ జరిమానాకు కారణం. ఈ ఉదంతం బెంగళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరులోని గంగాదరనగర్కు చెందిన ఓ వ్యక్తికి KA04KF9072 నంబర్ గల బైక్ ఉంది. అయితే గత రెండేళ్లుగా హెల్మెట్ లేకుండా బైక్‌పై అతడు ప్రయాణించడమే కాకుండా, ఇతర వ్యక్తులకు తన బైక్ ఇచ్చాడు. హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంప్ చేయడం.. ఇలా మొత్తం 643 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో పోలీసులు బైక్ యజమానికి చలానాలను విధించారు. మొత్తం చలానాలను లెక్కించగా రూ. 3.22 లక్షలుగా తేలింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిని గుర్తించేందుకు బెంగళూరు పోలీసులు టెక్నాలజీని వాడుతున్నారు. ఇందుకోసం నగరంలోని ప్రతి జంక్షన్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి సహాయంతో ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన బైక్ మీద వెళ్లినప్పుడు 643 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించారని గుర్తించినట్లుగా వెల్లడించారు.