Bilkis Bano Case : కొడుకు పెళ్లి చేయాలి, పంటలు కోతకొచ్చాయ్.. మాకు గడువు కావాలి: బిల్కిస్ బానో కేసు దోషులు
X
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌బానో కేసులోని క్షమాభిక్ష పొందిన 11 మంది దోషులను 2 వారాల్లో సరెండర్ కావాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా ఈ గడువు ఆదివారంతో ముగియనుంది. ఈ క్రమంలో సుప్రీం ఆర్డర్స్‌పై న్యాయస్థానం వేదికగా దోషులు స్పందించారు. తమకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని, లొంగిపోయేందుకు టైం ఇవ్వాలంటూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన తల్లిదండ్రులకు, పిల్లలకు తన అవసరం ఉందని ఆ పది మందిలో ఒకడైన గోవింద్ నాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.' ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నా ఇద్దరు పిల్లల అవసరాలు చూడాలి. నేను ఆస్తమాతో బాధపడుతున్నాను. ఇటీవలే సర్జరీ కూడా జరిగింది. విడుదల సమయంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నేను నడుచుకుంటున్నాను' అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. మిగతా ఇద్దరు దోషులైన ప్రదీప్ రామన్ లాల్ మోడియా, విపిన్ చంద్ర జోషి లు... కొడుకు పెళ్లి చేయాలని, పంటలు కోతకు వచ్చాయని అందుకే లొంగిపోయేందుకు కాస్త సమయం కావాలని పిటిషన్ లో తెలిపారు.
ఈ నేపథ్యంలో వారి విజ్ఞప్తులను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు నివేదించాలంటూ ధర్మాసనం రిజిస్ట్రీకి సూచించింది. పిటిషనర్లు లొంగిపోవడానికి నిర్దేశించిన సమయం ఆదివారంతో పూర్తయిపోతున్న నేపథ్యంలో వారి వినతులను పరిశీలించేందుకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని, ఇందుకోసం సీజేఐ నుంచి ఆదేశాల తీసుకోవాలని రిజిస్ట్రీని కోరింది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగాయి. అదే టైంలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులోని 11 మంది దోషులు 15ఏళ్లుగా కారాగారంలో గడిపారు. 2022లో వీరికి గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేయడంతో ఆ ఏడాది ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం.. వారి విడుదల చెల్లదని జనవరి 8న తీర్పు వెలువరించింది. వారంతా రెండువారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది.