బిల్ షేరింగ్ విషయంలో గొడవ.. బర్త్‌డే బాయ్‌ను చంపేసిన ఫ్రెండ్స్
X
పుట్టిన రోజే ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు అతడి స్నేహితులు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబీర్, షారుక్, నిషార్, మరో ఇద్దరు మైనర్లు స్నేహితులు. మే 31 సబీర్ పుట్టిన రోజు. పుట్టిన రోజు సందర్భంగా వీరంతా కలిసి శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. ఓ దాబాలో పార్టీ చేసుకున్నారు. అక్కడ మొత్తం రూ.10వేల బిల్ అయింది. ఈ బిల్ షేరింగ్ విషయంలో ఈ ఐదుగురి స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఆ తర్వాత సబీర్.. తన జేబులో నుంచే మొత్తం బిల్లు చెల్లించాడు.
కానీ తమతో గొడవకు దిగాడనే కోపంతో సబీర్ను చంపాలని నిర్ణయించుకున్నారు మిగతా నలుగురు. కొంతసేపటి తరువాత మరో పార్టీ ఏర్పాటు చేసి.. దానికి సబీర్ను ఆహ్వానించారు. అతడి చేత కేక్ కట్ చేయించి.. తినిపించారు. అనంతరం పదునైన ఆయుధాలతో సబీర్పై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సబీర్.. ప్రాణాలు కోల్పోయాడు.ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం పోలీసుల ముందు లొంగిపోయారు ఇద్దరు మైనర్ నిందితులు. షారుక్, నిషార్ మాత్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పట్టుబడ్డారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు.