PM Modi : ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.. ప్రధాని మోదీ
X
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా 370 స్థానాలు సాధిస్తుందని, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రావడం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తుడుచుకుపెట్టుకుపోతుందని ఎద్దేవా చేశారు. ఆదివారం ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ దుస్థితికి కాంగ్రెస్సే కారణమని, గిరిజనులంటే కాంగ్రెస్ కు చిన్నచూపని అన్నారు. గిరిజనులను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్‌లా మాత్రమే వాడుకుంటోందని ఆరోపించారు.
గిరిజనలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయటమే కాకుండా, వారిని అవమానపరిచిందన్నారు ప్రధాని మోదీ. దేశంలో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని పిలుపునిచ్చారు. దేశ ప్రజల కోసం 24/7 కష్టపడతామని మాట ఇచ్చారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రచారం మొదలెట్టింది. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రచారం చేస్తోంది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాల లోపాలను, వైఫల్యాలను అనుకూలంగా మార్చుకుంటోంది. ఇండియా కూటమి నుంచి పలు పార్టీలు బయటకు రావడంతో.. రాబోయే ఎన్డీయే కూటమేనని ప్రధాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు.