Lok Sabha 2024: బీజేపీ లొక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
X
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. తొలివిడతగా దేశవ్యాప్తంగా 195మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావదే.. తొలి జాబితాను మీడియా ముఖంగా ప్రకటించారు. మళ్లీ మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పిన ఆయన.. ప్రధాని మోదీ రాబోయే ఎన్నికల్లో మరోసారి వారణాసి నుంచే పోటీచేయనున్నట్లు తెలిపారు. ఇక అమిత్ షా గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ తొలి జాబితాలో మహిళలకు 28, యువతకు 47 , ఎస్సీ 27, ఓబీసీ 57, ఎస్టీలకు 18 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు.
తొలి జాబితాలో 34 మంది కేంద్రమంత్రులకు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. 195 స్థానాలకు గానూ ఢిల్లీకి 5 , పశ్చిమ బెంగాల్ 27, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ 12, తెలంగాణ నుంచి 9 మందికి చోటు కల్పించారు. అలాగే ఝార్ఖండ్-11, ఛత్తీస్‌గడ్-12, దిల్లీ-5, జమ్మూకశ్మీర్-2, ఉత్తరాఖండ్-3, అరుణాచల్ ప్రదేశ్-2, గోవా-1, త్రిపుర-1, అండమాన్ నికోబార్-1, దమన్ అండ్ దీవ్ -1 అభ్యర్థులను పోటీలో నిలిపింది.