BJP Election Committee: అక్టోబర్ 15న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
X
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో అక్టోబర్ 15 సాయంత్రం 6గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు అక్టోబరు 1న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ హాజరైన ఈ మీటింగ్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అభ్యర్థులను ఖరారుపై చర్చించారు. అక్టోబర్ 15న జరిగే సమావేశంలో మిగిలిన రాష్ట్రాల్లో బరిలో నిలిపే అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ రెడీ చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలను ‘ఎ,బి,సి,డి’లుగా వర్గీకరించింది. పార్టీ ఇదివరకే గెలిచి, ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా ఉన్న నియోజకవర్గాలను ‘ఏ’ కేటగిరీలో చేర్చింది. మిశ్రమ ఫలితాలు వచ్చిన స్థానాలను బి కేటగిరి కింద చేర్చింది. పార్టీ వీక్గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్‌ను ‘సి’, గత 3 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నియోజకవర్గాలను ‘డి’ కేటగిరిలో మార్చింది. వీటి ఆధారంగా ఏయే నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి సారించాలన్న అంశంపై పార్టీ కీలక నేతలు నిర్ణయం తీసుకుని, అందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.