బీజేపీలో కీలక పరిణామం.. ఆ నేతలకు అధిష్టానం పిలుపు
X
కర్నాటక ఓటమి ఎఫెక్ట్ తెలంగాణ బీజేపీపై పడినట్లు కన్పిస్తోంది. ఆ పార్టీలో అంతర్గత పోరు నడుస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు టాక్. వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్న తరుణంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. వారిద్దరికి ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపొచ్చింది.
అధిష్టానం పిలుపుతో ఈటల, కోమటిరెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు. పార్టీలో బాధ్యతల అప్పగింతపై అగ్రనాయకులు వీరితో చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్ది రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు. సడెన్ గా పార్టీ కార్యక్రమానికి వీరు ఎందుకు దూరంగా ఉన్నారనే చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు నేతలకు అధిష్టానం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈటల రాజేందర్కు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈటల ఢిల్లీ జాతీయ నేతలతో మంతనాలు జరపడం కూడా దీనికి బలాన్నిచ్చింది. అయితే పార్టీ నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో ఈటల అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అధిష్టానం పిలుపుతో ఈటలకు ప్రమోషన్ పై మరోసారి చర్చ ఊపందుకుంది.