Arvind Kejriwal : బీజేపీకి భయానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీనే.. ఎందుకంటే..
X
దేశంలో బీజేపీని భయపడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాత్రమేనని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. పదేళ్లలో 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని, ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నామని... ఈ కారణం చేతనే తమను అణచివేసి, అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు. పంజాబ్‌లో ఆదివారంనాడు జరిగిన జనసభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆప్ పాలనలో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి కేంద్రం దాదాపు రూ.8వేల కోట్ల నిధుల్ని నిలిపివేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ గవర్నరే రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తమ పార్టీ గత పదేళ్లలో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, పోటీ చేసిన ఇతర రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యే సీట్లు సాధిస్తున్నామన్నారు కేజ్రీవాల్. ఇదే కొనసాగితే కేంద్రంలోనూ ఆప్ ప్రభుత్వం వస్తుందని బీజేపీకి భయం పట్టుకుందన్నారు. తమ నేతల్ని అరెస్టు చేసి పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారం చేపట్టిన రాష్ట్రాల్లో పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించి, ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పారు. విద్యుత్తు, రోడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నామని, బీజేపీ ఇవేమీ చేయడం లేదన్నారు. గత 30 ఏళ్లుగా గుజరాత్‌లో, 15 ఏళ్లుగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో కొనసాగుతున్నా ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.
ఢిల్లీ ప్రజలు ఆప్‌కు 7 లోక్‌సభ స్థానాలు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు కేజ్రీవాల్ . పంజాబ్ ప్రజలు సైతం 13 లోక్‌సభ స్థానాలు ఆప్‌కు ఇస్తే ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరుస్తామన్నారు. ఛండీగఢ్‌లో ఒక స్థానానికి ఆప్ పోటీ చేస్తుందని, రాబోయే 10-15 రోజుల్లో ఈ 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.