Mohan Yadav Takes Oath: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణం
X
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మోహన్ యాదవ్. గవర్నర్ మంగూభాయ్ పటేల్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీశ్ దేవ్డాతో పాటు పులువురు మంత్రులు సైతం ప్రమాణం చేశారు. రాజధాని భోపాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు.
#WATCH | BJP leader Mohan Yadav takes oath as the Chief Minister of Madhya Pradesh.
— ANI (@ANI) December 13, 2023
Prime Minister Narendra Modi and other senior NDA leaders attend the ceremony. pic.twitter.com/aXWZMPyXBH
ప్రమాణ స్వీకారానికి ముందు భోపాల్‌లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు మోహన్ యాదవ్. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అంతకుముందు సోమవారం జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో మోహన్ యాదవ్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు నూతన ఎమ్మెల్యేలు. సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సహా పలువురు ఎంపీలు, కేంద్రమంత్రుల పేర్లు వినిపించాయి. వారందరినీ కాదని కొత్త వ్యక్తికి అధిష్ఠానం అవకాశం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన మోహన్ యాదవ్ (58) సరిగ్గా పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2013లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2020లో అప్పటి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం ఆయనను కేబినెట్ మంత్రిగా నియమించి ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు అప్పగించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా మూడోసారి గెలిచారు. మోహన్ యాదవ్ గతంలో RSS కార్యకర్తగా ఉన్నారు.