18 ఎన్డీఏ భేటీ.. టీడీపీ రీఎంట్రీ.. మరో రెండు పార్టీలు కూడా
X
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీ.. కలసివచ్చే శక్తులను కూడగడుతున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత బీజేపీ సారథ్యంలోని నేషనల్ డమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని అశోకా హోటల్లో ఈ నెల 18న జరిగే కూటమి భేటీతో కొత్త ఊపు ఉందని బీజేపీ భావిస్తోంది. సమావేశానికి రావాలని మాజీ మిత్రులైన శిరోమణి అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీలకు ఆహ్వానాలు అందాయి. ఏపీ విపక్షం టీడీపీకి కూడా కబురొచ్చిందని, చంద్రబాబు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. టీడీపీ దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు.
ఎందుకు?
ఎన్డీఏలో బీజేపీ ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడుస్తోంది. పార్లెమెంటులో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ.. కూటమిలోని భాగస్వామ్య పార్టీలను పట్టించుకోవడం లేదు. దీంతో కొన్ని కూటమి నుంచి తప్పుకుని తమ ప్రయోజనాలకు తగ్గట్లు వేర్వేరు పార్టీలతో జట్టుకట్టాయి. కొన్ని దెబ్బతిన్నాయి. మరోపక్క.. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులభసాధ్యం కాని పరిస్థితి నెలకొంది. తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రత్యామ్నాయం కోసం ప్రజలు విపక్షాల వైపు మొగ్గు చూపొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల నాటికి బలం పుంజుకోకపోతే మళ్లీ బీజేపీనే అధారంలోకి రావొచ్చని కొన్ని సర్వేల అంచనా. భారీగా పెరిగిన నిత్యవసరాల ధరలు, పేదరికం, నిరుద్యోగం, దెబ్బతిన్న మతసామరస్యం వంటి అనేక సమస్యల నడుమ ఒంటరి పోరాటానికికంటే ఉమ్మడి పోరాటమే ఉత్తమనని బీజేపీ భావిస్తోంది. 15కుపైగా విపక్షాలు చేతులు కలిపి జోరు పెంచిన నేపథ్యంలో తనకూ దోస్తులు ఉన్నారని చాటడం తాజా భేటీ ఉద్దేశంగా కనిపిస్తోంది.
టీడీపీ లాభమా? నష్టమా?
ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొనేకంటే బీజేపీతో కలసి పోరాడడమే మేలని చంద్రబాబు భావిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో బీజేపీకి పట్టులేకపోయినా, ఆ పార్టీతోనూ, జనసేనతోనూ పొత్తుపెట్టుకుంటే మరికొన్ని స్థానాల్లో గెలుపు బావుటా ఎగరేయొచ్చుని పచ్చపార్టీ ఆలోచన. ఒకవేళ అధికారంలోకి రాకపోయినా కొన్ని సీట్లలో కేంద్రంలో చక్రం తిప్పలాన్నది బాబు వ్యూహం. అయితే వైకాపాతోనూ ఎన్డీఏకి సత్సంబంధాలు ఉండడం ప్రతికూలాంశంగా మారింది. మొత్తానికి ఎన్డీఏ భేటికి హజరై చర్చల తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
అకాళీ దళ్, లోక్ జనశక్తి(చిరాగ్ పాశ్వాన్) పార్టీలు కూడా తిరిగి ఎన్డీఏ గూటికి చేరున్నాయి. బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా ఇటీవల నితీశ్‌తో తెగతెంపులు చేసుకుని ఎన్డీలో చేరింది. కుమారస్వామి సార్థ్యంలోని జనతా దళ్(ఎస్) కూడా బీజేపీ గొడగు కిందికి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఎవరు కలసి వస్తే వారితో జట్టుకట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకుసాగి, కాంగ్రెస్‌ను ఏకాకిని చేయాలన్నది ఎన్డీఏ వ్యూహం.