ఎవర్ని సీఎంను చేద్దాం? తలపట్టుకుంటున్న బీజేపీ
X
ఇటీవల ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ ఇంకా ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేదు. మూడు రాష్ట్రాల ముఖ్య మంత్రుల ఎంపికపై ప్రధాని నరేంద్ర నివాసంలో నాలుగున్నర గంటల పాటు చర్చ జరిగినప్పటికీ కొలిక్కి రాలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో సీఎం పదవి కోసం ప్రముఖులు, మాజీ ముఖ్య మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే సింధియా, రమణ్ సింగ్‌లు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త వారిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. పాత తరం నేతలను కూడా మార్చే ఆలోచనలో అధిష్టానం ఉంది.
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. ముఖ్యమంత్రుల ఎంపికపై అమిత్ షా, నడ్డాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. ఈ మూడు రాష్ట్రాలకు పార్టీ పరిశీలకులను నియమించి వారి నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభిప్రాయం తెలుసుకొని వారి అభిప్రాయాల ప్రకారం ముఖ్యమంత్రుల ను ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది.-
మధ్యప్రదేశ్‌లో
మధ్యప్రదేశ్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాధిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్రంలో సీనియర్ లీడర్ కైలాస్ విజయ్ వర్గీయ పోటీ పడుతున్నారు.
రాజస్తాన్‌లో
రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందగా...లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, ఇంకా పార్టీ సీనియర్ నాయకులు దియా కుమారి, మహంత్ బాలక్ నాథ్ లు కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో
ఇక ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ సాహో, ప్రతిపక్ష నాయకుడు ధరమ్ లాల్ కౌశిక్, మాజీ ఐఏఎస్ అధికారి ఓపీ చౌదరి కూడా పోటీలో ఉన్నారు.