INDIA Alliance Rally Cancelled : "ఇండియా" బహిరంగ సభ రద్దు.. అందుకే రద్దు చేసుకున్నారని బీజేపీ సటైర్లు
X
బీజేపీకి వ్యతిరేకంగా జతకట్టిన విపక్షాల కూటమి ఇండియాకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ కూటమి వచ్చే నెలలో ప్లాన్ చేసిన తొలి బహిరంగ సభ అనూహ్యంగా రద్దైంది. ఇండియా కూటమి సభ రద్దుకావడంపై బీజేపీపై సటైర్లు వేస్తోంది.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఇటీవల భేటీ అయిన ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా అక్టోబరు తొలి వారంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో కూటమి తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతి, కులగణన తదితర అంశాలను ఈ సభలో ప్రస్తావించాలని ప్లాన్ చేసింది. తాజాగా ఈ బహిరంగ సభను రద్దు చేసినట్లు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ ప్రకటించారు. బహిరంగ సభకు సంబంధించి కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కూటమిలోని ఇతర పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చాక పబ్లిక్ మీటింగ్పై తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఇండియా కూటమి బహిరంగ సభ రద్దుపై స్పందించిన బీజేపీ సటైర్లు వేసింది. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ప్రతిపక్షాల కూటమిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అందుకే విపక్షాలు సభను రద్దు చేసుకున్నాయని అంటోంది. సనాతన ధర్మాన్ని అవమానిస్తే ప్రజలు ఎన్నటికీ సహించరని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చురకలంటించారు. సభ రద్దుతో కూటమి నాయకత్వం బలంగా లేదని తేలిపోయిందని ఆయన విమర్శించారు. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ సతమతమవుతోందని, పోస్టర్లలో ఎవరి ఫోటో పెట్టాలన్న అంశంపై నేతలు కొట్లాడుకుంటున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ సటైర్ వేశారు.