Home > జాతీయం > బండి వర్సెస్ ఈటల.. బీజేపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు..!

బండి వర్సెస్ ఈటల.. బీజేపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు..!

బండి వర్సెస్ ఈటల.. బీజేపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు..!
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారమే లక్ష్యంగా మిషన్ 90 నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ రాష్ట్రంలో కీలక మార్పులు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు ప్రచార కమిటీ ఛైర్మన్ నియామకంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా ఆదివారం సమావేశమైన బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ నియమకం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై తమ అభ్యంతరాలు, వ్యతిరేకతను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

సీక్రెట్ మీటింగ్

తాజాగా ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి నివాసంలో పలువురు సీనియర్ నేతలు భేటీ అయ్యారు. జాతీయ కార్యవర్గసభ్యులు జి.వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.బూర నర్సయ్యగౌడ్, డా.విజయ రామారావు, సుద్దాల దేవయ్య, సీహెచ్‌ విఠల్, రచనా రెడ్డి తదితరులుఈ మీటింగ్ లో పాల్గొన్నారు. బండి సంజయ్‌కు అనుకూలంగా ఉన్న ఈ నేతలు నాయకత్వ మార్పు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించడంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్‌ను మార్చొద్దని, ఉద్యమకారులు, సీనియర్లైన తమను కాదని ఈటలకు కీలక పదవి ఇవ్వవద్దని అధిష్టానానికి గట్టిగా చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓ మాజీ ఎంపీతో పాటు కొంతకాలంగా చురుగ్గాలేని ఒకరిద్దరు నేతలు కూడా ఈ భేటీకి హాజరైనట్లు సమాచారం.

హైకమాండ్ నజర్

పార్టీలో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్నాటక ఫలితాల అనంతరం ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పలు దఫాలుగా సమావేశమై తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం సమావేశమైన పార్టీ అసంతృప్త నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటెత్తు పోకడలపై చర్చించారు. ఈ అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించనన్న ఈటల

బీజేపీ సీనియర్‌ నేతల భేటీపై స్పందించేందుకు ఈటల రాజేందర్‌ నిరాకరించారు. ఇలాంటి వాటిపై తాను మాట్లాడనని స్పష్టం చేశారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గానీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకుగానీ ఇస్తారన్న ప్రచారం జోరందుకుంది. మరోవైపు ఈటల రాజేందర్ కు కొత్తగా ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నారు. ఈ క్రమంలో సీనియర్ల భేటీ హాట్ టాపిక్ గా మారింది.

Updated : 12 Jun 2023 2:58 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top