Home > జాతీయం > కూలిన బ్రిడ్జి.. రెండు ముక్కలైన నేషనల్ హైవే

కూలిన బ్రిడ్జి.. రెండు ముక్కలైన నేషనల్ హైవే

కూలిన బ్రిడ్జి.. రెండు ముక్కలైన నేషనల్ హైవే
X

ఎన్ హెచ్ 16పై పెను ప్రమాదం తప్పింది. చెన్నై కోల్ కతాలను కలిపే జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జి రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హానీ కలుగలేదు. ఆ సమయంలో అక్కడున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఇతర వాహనదారులను అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఒడిశాలోని జాజ్‌పుర్‌ జిల్లాలో రసూల్‌పుర్‌ వద్ద ఈ ఘటన జరిగింది. రసూల్ పురా వద్ద ఎన్‌హెచ్‌-16పై రాకపోకలకు వీలుగా రెండు వంతెనలు నిర్మించారు. మంగళవారం ఉదయం భువనేశ్వర్‌ వైపు వెళ్తున్న ఓ బస్సు వంతెనను దాటింది. ఆ సమయంలో బ్రిడ్జి స్పాన్ విరిగిపోయింది. చూస్తుండగానే పెద్దఎత్తున శబ్దంతో కూలిపోయింది. ఇది గుర్తించిన.. ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు కౌఖాయ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ హోంగార్డు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జిపైకి ఎవరూ రాకుండా రాకపోకలను నిలిపేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాహనాలను దారి మళ్లించారు. వెహికిల్స్ అటువైపు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ వంతెనను పరిశీలించారు. 2008లో నిర్మించిన ఈ బ్రిడ్జి.. నిర్మాణ వైఫల్యం కారణంగానే కూలిపోయి ఉండొచ్చని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ జేపీ వర్మ మీడియాకు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated : 18 July 2023 5:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top