అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
X
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రిషి సునాక్ తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన సతీసమేతంగా అక్షర్‌ధామ్ ఆలయానికి వెళ్లారు. భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. రిషి సునాక్ దంపతులు దాదాపు గంట పాటు అక్కడే ఉన్నారు. బ్రిటన్ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాఖీ పండుగ ఘనంగా జరుపుకున్నానని రిషి సునాక్ ఇటీవలే చెప్పారు. అయితే శ్రీకృష్ణాష్టమి జరుపుకునేందుకు తీరిక దొరకలేదని విచారం వ్యక్తం చేశారు. అందుకు బదులుగా అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శిస్తానని ఇటీవల మీడియాతో చెప్పారు. ఈ క్రమంలో ఆయన భార్యతో కలిసి అక్షర్ ధామ్ ఆలయానికి వెళ్లారు. రిషి సునాక్ దంపతులకు ఆలయ పూజరులు పూల మాల వేసి ఆశీర్వచనం ఇచ్చారు. హిందువైనందుకు గర్విస్తానంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గతంలో పలుమార్లు వెల్లడించారు. తాను హిందువై పుట్టినందుకు గర్విస్తున్నానని, తన తల్లిదండ్రులు తనను అలాగే పెంచారని అన్నారు.
జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు రిషి సునాక్ దంపతులు శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. శనివారం రిషి జీ 20 నేతలతో బిజీబిజీగా గడిపారు. ఇవాళ అక్షర్ ధామ్ ఆలయంలో పూజల అనంతరం రిషి సునాక్ రాజ్ ఘాట్ వెళ్లారు. అక్కడ జీ 20 సమ్మిట్కు హాజరైన ప్రపంచదేశాల ప్రతినిధులతో కలిసి మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు.