Home > జాతీయం > మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు కేసీఆర్ పోటీ.. ఇదీ ప్లాన్!

మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు కేసీఆర్ పోటీ.. ఇదీ ప్లాన్!

మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు కేసీఆర్ పోటీ.. ఇదీ ప్లాన్!
X

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చిన అధినేత కేసీఆర్ జాతీయ స్థాయి వ్యూహాలు రచిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ గులాబీ దళానిదేనని ధీమాతో ఉన్న ఆయన పార్లమెంటు ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీని ఇతర రాష్ట్రాల్లో బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరేడు నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన మహారాష్ట్ర నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


‘మహా’ ఊపుతో..

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారాక కేసీఆర్ ప్రధానంగా మహారాష్ట్రపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ తొలి జాతీయ బహిరంగ సభను ఆ రాష్ట్రంలోని నాందేడ్‌లోనే నిర్వహించారు. తర్వాత పలు ప్రాంతాల్లోనూ సభలు జరిగాయి. తాజాగా 600 కార్ల భారీ కాన్వాయ్‌తో సోలాపూర్‌లో పర్యటించి కలకలం రేపారు. బీఆర్ఎస్‌లోకి మహారాష్ట్ర రాజకీయ నాయకులు పోటెత్తుతున్నారు. రైతుసంఘాల నేతలు, చిన్నచిన్న పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, చివరికి మరాఠా మాజీ సైనికులు కూడా ఆమడ దూరం నుంచి ప్రగతి భవన్‌కు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. మహారాష్ట్రలోని పలు సరిహద్దు జిల్లాల్లో బీఆర్ఎస్ కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని ప్రచారం చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రంలో పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతుండడంతో మరింత ఊపు కోసం అక్కడి నుంచే పార్లమెంటుకు పోటీ చేస్తే బావుంటుందని కేసీఆర్ ఆలోచన. మహారాష్ట్ర నేతలతోపాటు తెలంగాణ నేతలతోనూ ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరిపిన ఆయన పోటీకి సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఎందుకు?

బీఆర్ఎస్ అసలైన అర్థంలో జాతీయ పార్టీగా మారాలంటే కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైతే సరిపోదు. కనీసం రెండు మూడు రాష్ట్రాల నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి. మహారాష్ట్రతోపాటు పరిస్థితి అనుకూలిస్తే ఏపీ, కర్నాటకల నుంచి కూడా పోటీ చేసి లోక్‌సభలో రెండు మూడు రాష్ట్రాల నుంచి పార్టీకి ప్రాతినిధ్యం ఉండేలా చూడాన్నది దళపతి వ్యూహం. దీని కోసం తనే ధైర్యంగా బరిలోకి దూకితే పార్టీ నేతలకు స్ఫూర్తిగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. జాతీయ రాజకీయాలకు పార్లమెంటు వేదిక కాబట్టి దేశం దృష్టిని ఆకర్షించాలంటే కేవలం తెలంగాణ నేతగా కాకుండా రెండు మూడు రాష్ట్రాల పార్టీ నేతగా ప్రవేశిస్తే పార్టీని మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట పోటీ చేసి కొత్త జవసత్వాలిచ్చే కేసీఆర్.. అదే వ్యూహాన్ని మహారాష్ట్రలో అమలు చేయాలని భావించడం కూడా అక్కడి నుంచి పోటీకి మరో కారణమని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దక్షిణ తెలంగాణలో ఉద్యమ ప్రభావం లేదన్న అపోహకు చెక్ పెడుతూ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి సత్తా చాటడం దీనికి ఉదాహరణ అంటున్నారు.

సాధ్యమేనా?

నాందేడ్, లేకపోతే సోలాపూర్ నుంచి పోటీ చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. ఆ రెండు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్‌కు ఇప్పటికే చాలామంది నేతలు, వేలమంది కార్యకర్తలు ఉన్నారు. తెలుగువారి జనాభా కూడా ఎక్కువే. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, ఉచిత కరెంటు, దళితబంధు వంటి పథకాలతోపాటు భారీ సాగునీటి ప్రాజెక్టులపై ప్రచారం కలసి వచ్చే అంశమవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ భారీ మెజారిటీతో గెలిస్తే ఆ ప్రభావం పక్క రాష్ట్రంపైనా తప్పకుండా ఉంటుంది. లోక్ సభ ఎన్నికల నాటికి ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటే గెలుపు నల్లేరుపై బండి నడకేనని కేసీఆర్ ఆలోచన. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ చేశాక, సీఎం హోదాలో మరాఠా గడ్డపై నుంచి తలపడితే గెలుపు తథ్యమని ఆయన భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే తరచూ మహారాష్ట్ర నేతలను పిలుపించుకుని చర్చలు జరుపుతూ చేరికలకు ఊపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కూడా బీఆర్ఎస్‌కు కలసి వస్తుందని బీఆర్ఎస్ ఆలోచన. శివసేన, ఎన్సీపీల్లో చీలికలు, సీఎం ఏక్‌నాథ్ షిండేకు బీజేపీ హ్యాండిచ్చి గద్దె దింపే అవకాశం, వచ్చే ఏడెనిమిది నెలలు కొనసాగనున్న రాజకీయ అస్థిరతను సాయంతో గులాబీ జెండాను రెపరెపలాడించాలని కేసీఆర్ పకడ్బందీగా పథక రచన చేస్తున్నట్టు సమాచారం.



Updated : 10 July 2023 2:22 PM GMT
Tags:    
Next Story
Share it
Top