BRS PARTY:నేడు మహారాష్ట్రలోని ఇస్లాంపూర్‌లో బీఆర్ఎస్ భారీ సభ
X
భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలు భారీ సభలను కేసీఆర్ నిర్వహించారు.అక్కడి ప్రజల దృష్టి బీఆర్ఎస్పై పడేలా చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్ర పాలిటిక్స్‌లో బీఆర్ఎస్ ఉనికిని పెంచడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది. నేడు మరోసారి మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో భారీ చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
సాంగ్లీ జిల్లా ఇస్లాంపూర్‌లో నేడు బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎం పీ బీబీపాటిల్, మహారాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఇన్‌చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు, మహారాష్ట్ర కిసాన్‌సెల్ అధ్యక్షుడు మాణిక్‌కదమ్, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితరులు ఈ భారీ సభలో పాల్గొననున్నారు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ప్రముఖ షేత్కరి సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్‌పాటిల్ అధ్యక్షతన ఈ సభ జరుగనున్నది. ఈ సభలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షేత్కరి సంఘటన్ నాయకులు, కార్యకర్తలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు భారీ స్థాయిలో బీఆర్ఎస్లో చేరనున్నారు.