Home > జాతీయం > ఆ పేర్లు ఎందుకు పెట్టారు..? బెంగాల్ సర్కారుపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం

ఆ పేర్లు ఎందుకు పెట్టారు..? బెంగాల్ సర్కారుపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం

ఆ పేర్లు ఎందుకు పెట్టారు..? బెంగాల్ సర్కారుపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం
X

బెంగాల్లో ఇప్పుడో పెద్ద రచ్చ నడుస్తోంది. ఓ సఫారీలో సింహాలకు పెట్టిన పేర్లపై గాయిగత్తర లేస్తోంది. ఆ పేర్లే పెట్టాల్సిన అవసరం ఏంటని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోతున్నారు. విశ్వహిందూ పరిషత్ అయితే ఓ అడుగు ముందుకేసి కోర్టు తలుపులు తట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఆ పేర్లు మార్చండిరా బాబూ అంటూ ఆర్డర్ ఇచ్చింది. ఇంతకీ ఈ పేర్ల గోల ఏంటీ..? విషయం కోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూసేయండి.

బెంగాల్లో సిలిగురిలోని సఫారీ అది. ఇటీవలే త్రిపుర నుంచి ఆ సఫారీకి ఓ సింహాల జంట తెచ్చారు. అయితే ఆ రెండింటిని ఒకే ఎన్క్లోజర్లో పెట్టడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. అందుకు కారణం వాటి పేర్లే. ఆ రెండింటిలో ఒక సింహం పేరు అక్బర్ కాగా ఆడ సింహం పేరు సీత. ఇంకేముంది అక్బర్ తో సీతను ఒకే ఎన్ క్లోజర్లో పెట్టడం తమ మత విశ్వాసాలకు భంగం కలిగించడమేనని వీహెచ్పీ అంటోంది. వెంటనే వాటి పేర్లు మార్చాలని డిమాండ్ చేసింది. పనిలో పనిగా సింహాల పేర్లు మార్చాలంటూ కలకత్తా హైకోర్టు మెట్లు ఎక్కింది. ఆడ సింహం పేరు మార్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వీహెచ్పీ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సౌగతా భట్టాచార్య ధర్మాసనం ముందుకు వచ్చింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వివాదాలకు తావివ్వకుండా సింహాల పేర్లు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సింహానికి హిందూ దేవుళ్లు, ముస్లిం ప్రవక్త, జీసస్, స్వాతంత్ర్య సమరయోధులు, నోబెల్ అవార్డు గ్రహీతల పేర్లు పెడతారా అని జడ్జి ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్.. ఆ సింహాలకు త్రిపుర జూలో ఉన్నప్పుడే ఆ పేర్లు పెట్టారని, బెంగాల్ సర్కారు ఆ పేర్లు మార్చే ఆలోచనలో ఉందని ధర్మాసనానికి విన్నవించారు.

త్రిపుర ప్రభుత్వం సింహాలకు అక్బర్, సీత అనే పేర్లు పెట్టినా బెంగాల్ సర్కారు అలాంటి పేర్లు ఎందుకు పెట్టారని ఎందుకు ప్రశ్నించలేదని కోర్టు నిలదీసింది. మీ పెంపుడు జంతువులకు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లేమైనా పెట్టారా అని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ను ప్రశ్నించింది. ఇప్పటికైనా ఎలాంటి వివాదాలకు తావులేకుండా సీతతో పాటు అక్బర్ పేరు మార్చాలని జస్టిస్ భట్టాచార్య స్పష్టం చేశారు. విశ్వహిందూ పరిషత్ దాఖలు చేసిన పిటిషన్ను పబ్లిక్ ఇంట్రెస్ లిటిగేషన్ కింద రీ క్లాసిఫైడ్ చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి ఆ పిల్ను రెగ్యులర్ బెంచ్కు బదిలీ చేశారు.


Updated : 22 Feb 2024 2:26 PM GMT
Tags:    
Next Story
Share it
Top