Home > జాతీయం > మిజోరంలో ముగిసిన ప్రచారం.. నవంబర్ 7న పోలింగ్..

మిజోరంలో ముగిసిన ప్రచారం.. నవంబర్ 7న పోలింగ్..

మిజోరంలో ముగిసిన ప్రచారం.. నవంబర్ 7న పోలింగ్..
X

మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. దీంతో పాటు ఛత్తీస్ ఘడ్ లోనూ మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో క్యాంపెయినింగ్ ముగిసింది. ఆ రాష్ట్రంలోని 20 స్థానాల్లో తొలి విడతలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో సాయంత్రం ఆరు గంటలకు మిజోరంతో పాటు చత్తీస్ఘడ్ లోని 20 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం ముగించారు. నవంబర్ 7న జరగనున్న ఓటింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈసారి ఎన్నికల్లో 8.57లక్షల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 4,39,026 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారంతా 174 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ , జోరం పీపుల్స్‌ మూమెంట్‌, కాంగ్రెస్‌ పార్టీలు 40 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి. బీజేపీ 23, ఆమ్‌ ఆద్మీ పార్టీ కేవలం నలుగురు అభ్యర్థుల్ని మాత్రమే పోటీలో నిలిపింది. 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఇక చత్తీస్ ఘడ్ లో తొలి విడతలో ఎన్నిక జరగనున్న 20 స్థానాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన బస్తర్ తో పాటు మరో నాలుగు జిల్లాల్లో ఉన్నాయి. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 40,78,681 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 19,93,937 మంది కాగా.. మహిళా ఓటర్లు 20,84,675 మంది ఉన్నారు. 20స్థానాల్లో 223 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 29 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. చిత్రకూట్, దంతేవాడ స్థానాల్లో ఏడుగురు చొప్పున పోటీ చేస్తున్నారు.

ఓహ్లా-మాన్‌పూర్, అంతఘర్, భానుప్రతాప్ పూర్, కంకేర్, కేష్‌కల్, కొండగావ్, నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొంటా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 10 స్థానాలైన ఖైర్‌గఢ్, డొంగర్‌ఘర్, రాజ్‌నంద్‌గావ్, డోంగర్‌గావ్, ఖుజ్జీ, పండరియా, కవార్ధా, బస్తర్ (ఎస్‌టీ), జగదల్‌పూర్, చిత్రకోట్ (ఎస్‌టీ) స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు

Updated : 5 Nov 2023 9:22 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top