చంద్రయాన్-3పై ట్రోల్స్.. నటుడు ప్రకాష్ రాజ్పై కేసు
X
వెర్శటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ సినిమాల్లో ఎంత వివాదాస్పదంగా ఉంటారో.. బయట కూడా అలానే తయారవుతున్నారు. ఎప్పుడూ పాలిటిక్స్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడారు కూడా. అదే ఊపులో తాజాగా ఆయన చేసిన ట్వీట్ విమర్శల పాలవుతోంది. ఏంటి ప్రకాష్ రాజ్ మరీ ఇలాంటి పనులు చేయాలా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. చంద్రయాన్-3.. భారత్ కు ఇప్పుడిదొక ప్రతిష్ట. మన ల్యాండర్ చంద్రుని మీద అడుగుపెట్టే రోజు కోసం యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో దీని మీద ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.
విక్రయ్ ల్యాండర్ చంద్రుని మీద దిగిన తర్వాత పెట్టే మొదటి పోటో అంటూ ఒక ఫోటోను ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే చాలా మందికి నచ్చడం లేదు. మీ స్థాయికి తగ్గట్టు లేదంటూ ప్రకాష్ రాజ్ మీద విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ల్యాండర్ పంపిన తొలి చిత్రం అంటూ షేర్ చేసిన ఫొటో.. ఇస్రో మాజీ చీఫ్ శివన్ ను పోలి ఉంది. అతను టీ పోస్తున్నట్లు ఉన్న క్యారికేచర్ చిత్రాన్ని ఆయన పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన పలువురు ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటకలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్.. ‘తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను కేరళ చావ్వాలాను ఉద్దేశించి పోస్ట్ చేశా’ అని క్లారిటీ ఇచ్చాడు.