Home > జాతీయం > FIR Filed :ఆనంద్ మహీంద్రాపై చీటింగ్ కేసు

FIR Filed :ఆనంద్ మహీంద్రాపై చీటింగ్ కేసు

FIR Filed :ఆనంద్ మహీంద్రాపై చీటింగ్ కేసు
X

మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రాపై కాన్పూర్ లో (ఉత్తరప్రదేశ్) పొలీసు కేసు నమోదైంది. తన కుమారుడు చనిపోవడానికి ఆనంద్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కారణం అంటూ ఓ వ్యక్తి.. మహీంద్రాతో పాటూ మరో 12 మందిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టాడు. తాను కొనుగోలు చేసిన స్కార్పియో కారులో ఎయిర్‌బ్యాగులు లేవని.. దీంతో యాక్సిడెంట్ అయినపుడు తన కుమారుడు చనిపోయాడని ఆరోపించాడు. కారు భద్రతపై తప్పుడు హామీలు ఇచ్చిందని రాజేష్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు నమోదైంది.

ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన రాజేష్ మిశ్రా.. 2020 లో తన కుమారుడు అపూర్వ్‌కు ఓ బ్లాక్ స్కార్పియోను కొనిచ్చాడు. దాని విలువ అప్పుడు రూ. 17.39 లక్షలు. అయితే 2022 జనవరి 14 వ తేదీన అపూర్వ్ లక్నో నుంచి కాన్పూర్‌కు తిరిగి వస్తున్న సమయంలో స్కార్పియో ప్రమాదానికి గురైంది. పొగమంచు కారణంగా అపూర్వ్‌ వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అపూర్వ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అయితే ఈ ఘటన తర్వాత జనవరి 29 వ తేదీన ఆ కారును మహీంద్రా సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లి అందులో ఉన్న లోపాలను వారికి వివరించాడు. తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కాలేదని.. అసలు ఆ కారులో ఎయిర్ బ్యాగులు లేవని ఆరోపించాడు. భద్రతలో స్టార్ రేటింగ్ కలిగిన కారులో ఎయిర్ బ్యాగులు ఎందుకు లేవంటూ కారు కొనుగోలు చేసిన డీలర్‌షిప్‌ దగ్గర ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఉద్యోగులు, రాజేష్ మిశ్రా మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఉద్యోగులతో మాట్లాడేందుకు వెళ్లగా.. వారు తనను తిట్టారని.. చంపేస్తామని బెదిరించారని రాజేష్‌ మిశ్రా కేసు నమోదు చేశారు. మోసం, వాహనాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం సహా మరిన్ని సెక్షన్ల కింద ఆనంద్ మహీంద్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుర్నానీతో పాటు మొత్తం 14 మందిపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రాజేశ్ మిశ్రా ఆరోపణల మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఆనంద్ మహీంద్రా ఇంకా స్పందించలేదు.

Updated : 26 Sept 2023 10:52 AM IST
Tags:    
Next Story
Share it
Top