Home > జాతీయం > పిల్లి ఎదురొచ్చిందని ఆ దొంగలు ఏం చేశారంటే..

పిల్లి ఎదురొచ్చిందని ఆ దొంగలు ఏం చేశారంటే..

పిల్లి ఎదురొచ్చిందని ఆ దొంగలు ఏం చేశారంటే..
X

వెళ్తున్న దారిలో పిల్లి ఎదురురావడం అశుభంగా పరిగణిస్తారు కొందరు. ఆ మార్గంలో పిల్లి ఎదురైతే కాసేపు ఆగి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా ఆగడమే వారి కొంప ముంచింది. పిల్లి ఎదురురావడంతో అపశకునంగా భావించిన దొంగలు పారిపోకుండా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసుల చేతికి చిక్కడంతో వారు అరెస్ట్‌ అయ్యారు. ఆ దొంగల వద్ద భారీగా ఉన్న డబ్బు, నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది.

ఝాన్సీలో ఒక దొంగల ముఠా... గత కొన్నాళ్లుగా పలు దొంగతనాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ ముఠాను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో వారిని పట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మరో చోట దొంగతానికి పాల్పడిన కొందరు దొంగలు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఒక పిల్లి వారికి ఎదురైంది. అపశకునమని కాసేపు ఆగి వెళ్లొచ్చులే అని అక్కడే ఉన్నారు. దొంగల ముఠాను వెతుకుతూ అటుగా వచ్చిన పోలీసులు.. ఆ ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. ఆ దొంగల నుంచి భారీగా డబ్బు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వారిని మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాకు చెందిన అమిత్ పాఠక్ సోను, సైనిక్, రాహుల్ సేన్‌గా వారిని గుర్తించారు. చోరీ చేసిన తర్వాత పారిపోకుండా ఇక్కడే ఎందుకు ఉన్నారని పోలీసులు ప్రశ్నించగా వింత సమాధానమిచ్చారు. చోరీ తర్వాత పిల్లి అటుగా వెళ్లడంతో చెడు జరుగుతుందని భావించి పారిపోకుండా అక్కడ ఉన్నట్లు ఆ ముగ్గురిలో ఒకడు చెప్పాడు. అయితే ఝాన్సీలో జరిగిన పలు చోరీలతో వీరికి సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఈ దొంగల ముఠాను పట్టుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తుండగా అనుకోకుండా అరెస్ట్‌ అయ్యారని పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Updated : 20 Aug 2023 8:26 AM IST
Tags:    
Next Story
Share it
Top