News Click Case : న్యూస్‌క్లిక్‌పై సీబీఐ కేసు.. రెండు ప్రాంతాల్లో సోదాలు
X
చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తున్నదని, అందుకోసమే ఆ దేశం నుంచి డబ్బులు అందుకుంటున్నదనే ఆరోపణలతో ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలతోనే ఈ నెల 3 న న్యూస్ క్లిక్ ఫౌండర్ ప్రబీర్ పుర్కాయస్థను ఉపా చట్టం కింద అరెస్టు చేశారు కూడా. అయితే ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, డ్రాగన్ నుంచి ఒక్క పైనా కూడా తనకు రాలేదని ప్రబీర్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు కూడా. అవేవీ పట్టించుకోని కేంద్రం.. తాజాగా సంస్థపై మరో కేసు నమోదు చేసింది. ఎఫ్సీఆర్ఏ(FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం దిల్లీలోని రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే ఉపా చట్టం కింద అరెస్టై జైలులో ఉన్నారు ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రబీర్ పుర్కాయస్థ. ఆయనతో పాటు HR చీఫ్ అమిత్ చక్రవర్తిని న్యాయస్థానం 7రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.
అయితే ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్‌పై వామపక్షాలు మండిపడుతున్నాయి. నిజాలు చెప్పేవారినే మోడీ సర్కార్ దేశద్రోహులుగా ముద్ర వేస్తోందని, ప్రశ్నించే తత్వాన్ని అది జీర్ణించుకోలేకపోతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ విమర్శించారు. కార్మికులు, అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారు చేస్తున్న ఉద్యమాలను కవర్ చేస్తున్నందునే 'న్యూస్ క్లిక్'పై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆమె అన్నారు. సమాజంపై విద్వేష విషం చిమ్మే సంఫ్‌ు పరివార్ (ఆర్‌ఎస్‌ఎస్) వారపత్రిక 'ఆర్గనైజర్'కు మాత్రం ఎనలేని స్వేచ్ఛను కల్పించారని తప్పుబట్టారు. చైనాతో ముడిపెట్టి నకిలీ జాతీయవాదంతో పత్రికా స్వేచ్ఛపై మోడీ సర్కార్ దాడి చేస్తోందన్నారు.
కేంద్ర ఏజెన్సీలు 2020 నుంచి న్యూస్ క్లిక్‌పై విచారణ జరుపుతున్నాయని, మూడేళ్లు శ్రమించినా ఇడి, సిబిఐ, ఐబిలు న్యూస్ క్లిక్‌కు వ్యతిరేకంగా ఏమీ కనుగొనలేకపోయాయని చెప్పిన బృందా కారత్.. ప్రబీర్ పుర్కాయస్థతో సహా ఎవరినీ అరెస్టు చేయొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు గతంలోనే ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కేసును హైకోర్టు మళ్లీ విచారిస్తున్న సమయంలో ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిని యుఎపిఎ కింద అరెస్టు చేశారని అన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి ప్రబీర్ పుర్కాయస్థ అని, పోలియో కారణంగా శారీరక సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తి అమిత్ చక్రవర్తి అని బృందాకరత్ తెలిపారు.
#WATCH | CBI conducts searches at the premises of NewsClick in Delhi.
— ANI (@ANI) October 11, 2023
CBI registered a case against NewsClick for violation of the Foreign Contribution Regulation Act. pic.twitter.com/Z8h3FomDxc