Myanmar : మయన్మార్ సరిహద్దు పై కేంద్రం సంచలన నిర్ణయం
X
భారత్, మయన్మార్ సరిహద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి స్వేచ్ఛాయుత రాకపోకలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మయన్మార్ సరిహద్దు వెంబడి కంచె నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అసోం పోలీసు కమాండోల పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ సరిహద్దు మాదిరిగానే మయన్మార్ బార్డర్‌ను కూడా పరిరక్షించాల్సి ఉందని ఆయన అన్నారు. మయన్మార్ సరిహద్దు సమీపంలో నివసించే ప్రజలు 16 కిలో మీటర్ల దూరం దాటి పరస్పర భూభాగంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తున్న ‘స్వేచ్ఛా రవాణా వ్యవస్థ (ఎఫ్‌ఎంఆర్)’ ఈ ప్రకటనతో త్వరలో ముగియగలదు. మయన్మార్ లో వర్గాల పోరు నానాటికీ తీవ్రమవుతోంది.
దీని నుంచి తప్పించుకునేందుకు భారత్ లోకి వారి సైనికులు వలస వచ్చేస్తున్నారు. వీరి రాక వల్ల భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సరిహద్దుల తరహాలోనే మయన్మార్ సరిహద్దుల్లోనూ కంచె వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత మూడు నెలల్లో 600 మంది మయన్మార్ సైనికులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు. వీరిని మిజోరంలో ఉన్న వలస క్యాంపులకు పంపారు. ఇప్పటివరకూ మయన్మార్ నుంచి భారత్ లోకి ఎలాంటి వీసాల్లేకుండానే అక్కడి పౌరులు వచ్చేస్తున్నారు. కానీ ఇకపై కంచె వేయడంతో పాటు వీసా నిబంధనల్ని అమల్లోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల వారు సైతం వీసా ఉంటేనే భారత్ లోకి ప్రవేశించేందుకు వీలుంటుంది. భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న పౌరుల్ని దృష్టిలో ఉంచుకుని ఇరుదేశాల మధ్య 1970లో స్వేచ్ఛా ప్రయాణ అవకాశం కల్పించారు. దాన్ని కేంద్రం ఇప్పుడు రద్దు చేయబోతోంది.