Lok Sabha Elections-2024 : లోక్‌సభ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన
X
లోక్‌సభ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభతో పాటుగా పలు రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి కూడా ఇంకొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే ఎన్నికల షెడ్యూల్ కోసం దేశ ప్రజలతో పాటుగా పార్టీలన్నీ ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక విషయం చెప్పింది. లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు. నేడు ఒడిశాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీవ్ కుమార్ చెప్పిన మాటల ప్రకారం చూస్తే వచ్చే నెలలోనే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే నెలలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఈ రెండు ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రత విషయంలో కఠినంగా ఉండాలని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల వేళ డబ్బు ప్రవాహాన్ని తగ్గించేందుకు ఇప్పటి నుంచే తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని, అయితే షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఏయే తేదీల్లో విడుదల చేస్తామనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమ ని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.