బియ్యం, గోధుమలు రాష్ట్రాలకు అమ్మొద్దు.. ఎఫ్సీఐకు కేంద్రం హుకుం
X
రాష్ట్రాలపై మోడీ సర్కారు కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తోంది. తిండి గింజల విషయంలోనూ అమానుషంగా వ్యవహరిస్తోంది. తాజాగా రాష్ట్రాలకు బియ్యం, గోధుమలు విక్రయించకుండా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎఫ్సీఐపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై ఎఫ్సీఐ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం కింద కేవలం ప్రైవేటు పార్టీలకు మాత్రమే బియ్యం, గోధుమలు అమ్మాలని ఆదేశించింది. 15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రైవేటు పార్టీలకు విక్రయించేందుకు జూన్ 28 నుంచి ఈ వేలం ప్రక్రియ నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రాలకు మరింత భారం
ఎఫ్సీఐ కేవలం ఈశాన్య రాష్ట్రాలు, శాంతి భద్రతల సమస్య నెలకొన్న, ప్రకృతి వైపరిత్యాల కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు మాత్రమే బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రాలకు శరాఘాతంగా మారింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సంబంధం లేకుండా సొంతంగా బియ్యం పంపిణీ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందుకు అవసమైన బియ్యాన్ని కిలోకు రూ.34చొప్పున చెల్లించి ఎఫ్సీఐ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా కేంద్రం రాష్ట్రాలకు బియ్యం విక్రయించొద్దంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఈ పథకాల అమలు రాష్ట్రాలకు మరింత భారంగా మారనుంది. ఇకపై ఆ స్కీంల కోసం ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్ నుంచి బియ్యం సేకరించాల్సి ఉంటుంది. ఇది ఆయా రాష్ట్రాల ఖజానాకు మరింత భారంగా మారనుంది.
కొత్త రేషన్ కార్డులివ్వని కేంద్రం
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు కూడా అదనంగా ఇవ్వలేదు. దీంతో చాలా మందికి చౌకబియ్యం లభించడంలేదు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు పేదల సంక్షేమం దృష్ట్యా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాయి. అందుకు అవసరమైన బియ్యాన్ని కేజీకి రూ.34 చొప్పున చెల్లించి ఎఫ్ సీఐ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ బియ్యం కూడా అందకుండా కేంద్రం అమానవీయంగా వ్యవహరిస్తోదంని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.