తెలంగాణ ఏపీకి ఇవ్వాల్సిన 6 వేల కోట్లను కట్ చేసి ఇస్తాం.. కేంద్రం
X
ఏపీ, తెలంగాణల మధ్య విభజన పంచాయతీ ఇంకా తెగడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ. 6 వేల కోట్లను ఇంకా చెల్లించకపోవడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలను ఆర్బీఐలోని తెలంగాణ రాష్ట్ర ఖాతా నుంచి మినహాయించుకుని ఏపీకి చెల్లిస్తామని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
‘‘ఈ అంశంపై ఇప్పటికే న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాం. ఆర్థికశాఖతో చర్చిస్తున్నాం. ఏపీకి డబ్బులు వచ్చేలా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. రెండు రాష్ట్రాల అధికారుల స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చాం’’ అని ఆయన చెప్పారు. బకాయి చెల్లించకుండా తెలంగాణ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుందని, స్టే ముగిసినా చెల్లించడం లేదని సింగ్ తెలిపారు. దీంతో తెలంగాణ ఖాతా నుంచి డబ్బులు తీసి ఏపీ ఖాతాకు జమ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు ఏపీ నుంచి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ. 6 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. విభజనతో ఎక్కవ విద్యుత్కేంద్రాలు ఏపీకి వెళ్లడం వల్ల తెలంగాణలో కరెంటు కొరత ఏర్పడింది. దీంతో కేంద్రం ఆదేశాలతో ఏపీ కొత్త రాష్ట్రానికి కరెంటు ఇచ్చింది. బకాయిలు చెల్లించేలా చూడాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర మంత్రులను కోరుతున్నారు.