శుభవార్త..ఉల్లి ఘాటు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
X
దేశవ్యాప్తంగా టమాటా ధరలు సామాన్యులకు ఏ విధంగా చుక్కలు చూపించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. టమాట ధర తగ్గుతోందిలే అని అనుకునేలోపే ఉల్లి బాంబు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నెల చివర్లో ఉల్లి ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఉల్లి ఘాటును తగ్గించేందుకు వాటి ధరలు పెరగకుండా కల్లెం వేసేందుకు తాజాగా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.
ఉల్లి ధరలకు కల్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆహార మంత్రిత్వశాఖ శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సేకరించిన పెట్టిన బఫర్ స్టాక్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని కేంద్ర సర్కార్ గోడౌన్లలో బఫర్ స్టాక్‌గా స్టోర్ చేసింది. ప్రతి సంవత్సరం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉల్లిని విడుదల చేస్తోంది. ఉల్లి సరఫరా తగ్గి, ధరలు పెరిగిన సందర్భాల్లో సర్కార్ ఆ బఫర్ స్టాక్‌ను పంపిణీ చేస్తుంటుంది. అలా నిత్యావసరాల్లో ఒకటైన ఉల్లి ధరలను నియంత్రిస్తుంటుంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లిని తరలించేందుకు ఆహార మంత్రిత్వశాఖ డిసైడ్ అయ్యింది. ఈ సంవత్సరం అత్యధిక రేట్లు నమోదైన, గత నెలతో పోలిస్తే ఉల్లి ధరలు అధికమైన ప్రాంతాలకు ఉల్లి సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ-వేలం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఉల్లిని సరఫరా చేయనుంది. ఒకవేళ రాష్ట్రాలు వారి అవసరాన్ని బట్టి కోరితే తగ్గింపు ధరతో ఉల్లి పంపిణీ చేస్తామని వెల్లడించింది.