Union Budget 2024: టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు: బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి
X
(Union Budget 2024) సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న వేళ.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గురువారం లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. గతేడాది లాగానే ఈసారీ కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా మంత్రి నిర్మల.. బడ్జెట్‌ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా నిర్మల లక్షద్వీప్ కు గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో టూరిజం బాగా అభివృద్ధి చెందుతుందని నిర్మల అన్నారు. ఆధ్యాత్మిక టూరిజం పట్ల దేశ ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని దాన్ని ప్రోత్సహిస్తూ.. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పుకొచ్చారు.
దేశ పరిధిలోని ద్వీపాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి, స్థానికులకు అవకాశాలు పెంచేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రపంచం చూపును మన ద్వీపాల వైపు తిప్పుకునేలా చేస్తామని స్పష్టం చేశారు. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు కల్పిస్తామని తెలిపారు. లక్షద్వీప్ వంటి దీవుల్లో వసతులు, ఇతర సౌకర్యాలను పెంచుతామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పారు.
బడ్డెట్ సమావేశాల్లో వీటితో పాటు.. మెట్రో విస్తరణపై కూడా మాట్లాడారు. దేశంలోని మరిన్ని నగరాలకు మెట్రో రైలు సేవల్ని విస్తరించనున్నట్లు చెప్పుకొచ్చారు. వీటితో పాటు మరో మూడు కొత్త రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రస్తుం మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. కొత్త రోడ్, రైలు కారిడార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా 41 వేల రైల్వే కోచ్ లను వందే భారత్ కింద మార్చుతామన్నారు. పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు 1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్ ప్రకటించారు.