Jharkhand assembly :జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెర... చంపైకు లైన్ క్లియర్
X
జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన చంపై సోరెన్( Champai Soren) ప్రభుత్వానికి అనుకూలంగా 47 మంది ఓటేయగా, వ్యతిరేకంగా కేవలం 29 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో చంపై సర్కార్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లయింది. అంతకుముందు శాసనసభలో చంపయీ సోరెన్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్‌ను చేపట్టారు. ఈ ఓటింగ్ కు మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా హాజరయ్యారు.
ఆ 47 మంది ఓటేశారు..
81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 41 కాగా.. జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 16, ఆర్జేడీ, సీపీఐఎంల్ లకు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక ప్రతిపక్షంలోని బీజేపీకి 25మంది సభ్యులుండగా.. ఏజేఎస్యూకు 3,ఎన్సీపీ 1,ఇతరులు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన 47 మంది మద్దతున్న జేఎంఎం - కాంగ్రెస్ కూటమి బలనిరూపణలో సునాయాసంగా గెలిచింది.
జనవరి 31 బ్లాక్ డే
బలపరీక్షకు ముందు చంపై సోరెన్ .. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. హేమంత్ సోరెన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోందని మండిపడ్డారు. ఇక ఈ రోజు పటిష్ఠ బందోబస్తు మధ్య జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren) అసెంబ్లీకి చేరుకున్నారు. తన అరెస్టులో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందని , గత నెల 31న దేశంలోనే తొలిసారిగా ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేశారని, ఇది దేశ చరిత్రలో మాయని అధ్యాయంగా మిగిలిపోతుందని చెప్పారు. దేశ చరిత్రలో జనవరి 31(January 31)ని బ్లాక్ డేగా అభివర్ణించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీకి సవాల్ విసిరారు.