Home > జాతీయం > జార్ఖండ్లో హైడ్రామాకు ఎండ్ కార్డ్.. సీఎంగా చంపైసోరెన్ ప్రమాణం

జార్ఖండ్లో హైడ్రామాకు ఎండ్ కార్డ్.. సీఎంగా చంపైసోరెన్ ప్రమాణం

జార్ఖండ్లో హైడ్రామాకు ఎండ్ కార్డ్.. సీఎంగా చంపైసోరెన్ ప్రమాణం
X

జార్ఖండ్లో 2 రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. నాటకీయ పరిణామాల మధ్య చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాథాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన చంపై సోరెన్.. పది రోజుల్లో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు ఫిబ్రవరి 5 సోమవారం చంపై సోరెన్ సభలో బల నిరూపణకు సిద్ధమయ్యారు.

మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ చంపై సోరేన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం రాత్రి ఆహ్వానించారు. అంతకు ముందు గురువారం ఉదయం గవర్నర్‌ను కలిసిన చంపై సోరెన్‌.. హేమంత్‌ సోరెన్‌ రాజీనామా అనంతరం రాష్ట్రానికి కొత్త సీఎం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని గవర్నర్ దృష్టికి తెచ్చారు. సీఎం లేకపోవడంతో రాజకీయ సంక్షోభం ముదిరే ప్రమాదం ఉందని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నందున తమ విజ్ఞప్తిని అంగీకరించాలని కోరారు. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ తాత్సారం చేయడంతో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రెండు ప్రత్యేక విమానాలను సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం వారు హైదరాబాద్ కు రావాల్సి ఉండగా.. పొగమంచు కారణంగా ఫ్లైట్లు టేకాఫ్ కాలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో చంపై సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. మొత్తం 81 మంది సభ్యులున్న జార్ఖండ్‌ అసెంబ్లీలో.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 41 కాగా.. జేఎంఎం కూటమికి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి 48 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 25, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 3, ఎన్సీపీ 1, ఇండిపెండెంట్లు 3 చోట్లు విజయం సాధించారు.

Updated : 2 Feb 2024 12:47 PM IST
Tags:    
Next Story
Share it
Top