ఝార్ఖండ్లో రాజకీయ సస్పెన్స్కు తెర.. ఇవాళ సీఎంగా చంపై ప్రమాణం
X
ఝార్జండ్లో నెలకొన్ని రాజకీయ అనిశ్చితికి ఇవాళ తెరపడనుంది. జేఎంఎం కూటమి నేత చంపై సోరెన్ ఇవాళ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. నిన్న సాయంత్రం ఆయన గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి ఎమ్మెల్యేల మద్ధతు వీడియోను చూపించారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు గవర్నర్కు తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంపైను ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం చంపై ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇక 10 రోజుల్లో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా చంపైకు గవర్నర్ సూచించారు. దీంతో ఝార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. అటు బీజేపీ సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. దీంతో జేఎంఎం - కాంగ్రెస్ కూటమి అలర్ట్ అయ్యింది. క్యాంప్ రాజకీయాలకు తెరదీసింది. కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించే ప్రయత్నాలు చేస్తోంది. నిన్న రాత్రే ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకోవాల్సి ఉన్నా.. ఝార్ఖండ్ ఎయిర్ పోర్టులో పొగమంచు వల్ల విమానం టేకాఫ్ కు ఏటీసీ పర్మిషన్ ఇవ్వలేదు.
ఇకపోతే చంపై సోరెన్ జార్ఖండ్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆయనది సరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని జిలింగ్‌గోడ గ్రామం. 90వ దశకంలో చంపై సోరెన్ జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయనకు జార్ఖండ్ టైగర్‌గా పేరుంది. జేఎంం వ్యవస్థాపకుడు షిబు సోరెన్కు చంపై సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం అభ్యర్థిగా ఎంపికయ్యారు. మరోవైపు మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన్ను ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. మనీలాండరింగ్ కేసులో సోరెన్ను ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. ఆయన్ని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా.. న్యాయస్థానం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది.
కాగా రూ.600కోట్ల భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. భారత సైన్యం ఆధీనంలో ఉన్న భూమిని సోరెన్ అక్రమంగా విక్రయించి లబ్దిపొందారని ఈడీ అభియోగాలు మోపింది. ఇప్పటికే పలుసార్లు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే సోరెన్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో బుధవారం ఆయన్ను 7గంటల పాటు విచారించిన ఈడీ ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసింది. అయితే ఈడీ అరెస్ట్ ను సోరెన్ సుప్రీంలో సవాల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం సుప్రీం ఈ పిటిషన్ను విచారించనుంది.