పెట్రోల్ కోసం ఎగబడుతున్న జనం.. అధికారుల కీలక నిర్ణయం..
X
హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సైతం ఇందులో పాల్గొంటుండటంతో పెట్రోల్, డీజిల్ కోసం జనం ఎగబడుతున్నారు. స్టాక్ అయిపోకముందే వీలైనంత ఎక్కువ పెట్రోల్ కొనేందుకు జనం మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చండీఘడ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
చండీఘడ్లో చాలా మంది వాహనదారులు లీటర్లకొద్దీ పెట్రోల్ కొనుగోలు చేస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. టూవీలర్ కలిగిన వారికి 2 లీటర్లు, ఫోర్ వీలర్ ఉన్న వారికి 5 లీటర్లు పెట్రోల్ మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అందరికీ పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పెట్రోల్ బంకుల ఆపరేటర్లు ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కస్టమర్లు సైతం సహకరించాలని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.