Home > టెక్నాలజీ > జులై 14 చంద్రయాన్ -3ను ప్రయోగించనున్న ఇస్రో

జులై 14 చంద్రయాన్ -3ను ప్రయోగించనున్న ఇస్రో

జులై 14 చంద్రయాన్ -3ను ప్రయోగించనున్న ఇస్రో
X

చంద్రయాన్ -2 సాఫ్ట్ ల్యాండింగ్ జరగకపోయివడంతో ఫెయిల్ అయింది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద కూలిపోయింది. ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మళ్ళీ ఇంకో చంద్రయాన్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 14న చంద్రయాన్-3 ను మూన్ మీదకు పంపించనుంది.

ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాలు మాత్రమే చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసాయి. భారత్ ఇప్పటివరకు దానిని సాధించలేకపోయింది. ఈసారి మాత్రం తప్పకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఎలా అయినా మిగతా దేశాల సరసన చేరతామని అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అందుకు అనుగుణంగా చంద్రయాన్-3 ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ను ప్రయోగించనున్నారు. మొదట జులై13 న అనుకున్నా...లాంచ్ విండో అనుకూలతలు పరిశీలించాక ఒకరోజు వెనక్కు జరిపారు.





జులై 14న ప్రయోగించే ఉపగ్రహం ఆగస్టు చివరి నాటికి చేరుకుంటుందని చెప్పారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. ఆగస్టు 23 లేదా24న చంద్రయాన్ -3 రోవర్ చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ అయ్యే అవకాశం...అది కూడా పరిస్థితులు అనుకూలిస్తే అని ఆయన అన్నారు. ఒకవేళ ఆ రెండు రోజుల్లో కనుక ల్యాండింగ్ అవకపోతే మరో నెల రోజులు ఎదురు చూడాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద వెలుతురు లేకపోవడం వలన ల్యాండర్, రోవర్ లకు శక్తి ఉండదు అందుకే ఉపరితలం మీద 70 డిగ్రీల దక్షిణంగా ల్యాండింగ్ జరిగేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు.





చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతం అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నామని అన్నారు సోమనాథ్. ల్యాండింగ్ విజయవంతమైన తర్వాత విక్రమ్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడిపోతుందని ఇది కెమెరాల్లో రికార్డ్ అవుతుందని ఆయన తెలిపారు. రోవర్ చక్రాల సాయంతో చంద్రుని మీద కదులుతుందని చెప్పారు. ప్రజ్ఞాన్ రోవర్ అడ్డంకులను నివారించడానికి కెమెరాలను కూడా అమర్చారు. ల్యాండర్ లో అన్ని కెమెరాలు అన్ని సమయాల్లో రోవర్ ను చూడగలిగేలా అమర్చామని వివరించారు. ప్రస్తుతం వాటి పనికాలం 14 రోజులుగా ఉందని తెలిపారు. తాము అది కవర్ చేసే దూరాన్ని మ్యాప్ చేస్తామని, ల్యాండర్, రోవర్ జీవిత కాలం పొడిగించినట్లయితే అది మరి కొన్ని రోజులు ప్రయాణించే అవకాశం ఉంటుందని చెప్పారు.

చంద్రయాన్ -3 ఎల్‌వీఎం-3పీ4 లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ అనే మూడు మాడ్యూల్స్ ఉన్నాయి. రాకెట్ బరువు 3,900 కిలోలు. ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2, 148 కిలోలు, రోవర్ లో కలుపుకుని ల్యాండర్ మాడ్యూల్ బరువు 1, 752 కిలోలు.


Updated : 7 July 2023 4:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top