IndiGo flight: లాస్ట్ మినిట్‌లో ఫ్లైట్ క్యాన్సిల్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం
X
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికులు నిరసన చేపట్టారు. ఢిల్లీ నుంచి ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళన చేపట్టారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇండిగో విమానం 6ఈ 2198 ఢిల్లీ నుంచి జార్ఖండ్‌లోని డియోగఢ్‌కు బుధవారం తెల్లవారుజామున వెళ్లాల్సి ఉంది. అయితే ఆ విమానాన్ని ఆ సంస్థ రద్దు చేసింది. దీంతో విమాన ప్రయాణికులు.. ‘ఇండిగో చోర్ హై, బంద్ కరో’ అంటూ నినాదాలు చేశారు. ఈ గందరగోళానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Passengers of Delhi-Deoghar IndiGo flight raise slogans and protest against the airline after it cancels the flight originating from Terminal 2 of Delhi airport pic.twitter.com/L8Nj1cW4Vq
— ANI (@ANI) January 31, 2024
దీనిపై విమానాశ్రయ అధికారులు స్పందిస్తూ.. వాతావరణ పరిస్థితులు, నియంత్రణకు మించిన కారణాల వల్ల ఢిల్లీ-డియోగఢ్ విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. విమాన ప్రయాణికులకు పూర్తి రీఫండ్, ప్రత్యామ్నాయ మార్గాలు లేదా రీషెడ్యూలింగ్ పొందే ఆప్షన్లు ఇవ్వడంతోపాటు రిఫ్రెష్‌మెంట్లు అందించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఢిల్లీలో పొగమంచు ఎక్కువగా ఉండటంతో 200 పైగా విమానాలు ఆలస్యంగా నడవగా, మరికొన్నింటిని దారి మళ్లించడంతో పాటు 11 విమానాలను రద్దు చేశారు.
ఇండిగోపై ఫిర్యాదులు రావడం ఇటీవల కాలంలో చాలా జరిగాయి. గత వారం ముంబై విమానాశ్రయంలో విమానం ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఎయిర్‌స్ట్రిప్ దగ్గర బయట భోజనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీంతో విమానయాన నియంత్రణ సంస్థ ముంబై విమానాశ్రయానికి రూ. 90 లక్షలు, ఇండిగో ఎయిర్‌లైన్‌కు రూ.1.2 కోట్ల జరిమానా విధించింది.