Home > జాతీయం > సీన్ రిపీట్.. ఫార్మ‌సీ ఉద్యోగి ఖాతాలోకి రూ. 753 కోట్లు

సీన్ రిపీట్.. ఫార్మ‌సీ ఉద్యోగి ఖాతాలోకి రూ. 753 కోట్లు

సీన్ రిపీట్.. ఫార్మ‌సీ ఉద్యోగి ఖాతాలోకి రూ. 753 కోట్లు
X

బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యమో.. లేదంటే మరేతర కారణాల వల్లో కానీ.. సామాన్య వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ కావడం.. మళ్లీ సారీ అంటూ ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం ఈ మధ్యే చూస్తూనే ఉన్నాం. గత నెల ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా 9 వేల కోట్ల రూపాయలు జమఅయ్యాయనే వార్త విని అంతా ఆశ్చర్యపోయారు. ఆ డబ్బుతో అతను ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే.. పొరపాటు జరిగిందంటూ తమిళనాడు మార్కంటైల్‌ బ్యాంక్‌, ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. ఇది మరవక ముందే అదే రాష్ట్రంలోని మరో యువకుడి అకౌంట్ లో కొటాక్‌ మహేంద్ర బ్యాంక్‌ నుంచి 753 కోట్ల 44 లక్షల రూపాయలు చేరాయి. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.

వివరాలు.. తిరునెల్వేలి జిల్లాకు చెందిన మహమ్మద్ ఇద్రీస్ చెన్నైలోని తీనాంపేటలోని ఎల్డామ్స్ రోడ్‌లో నివసిస్తున్నాడు. అక్కడికి సమీపంలోని ఓ ఫార్మసీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. అతడి కోటక్ మహీంద్రా బ్యాంకు అకౌంట్లో రూ. 3 వేలు ఉండగా.. అందులో నుంచి రూ. 2 వేలను శుక్రవారం ఉదయం తన స్నేహితుడికి ట్రాన్సఫర్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఇద్రీస్ బ్యాంక్ ఖాతాలో రూ. 753 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపించింది. దీంతో ఇద్రీస్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

వెంటనే ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే సాంకేతిక లోపం వల్ల తప్పుగా డబ్బులు జమ అయినట్టుగా గుర్తించిన తెనాంపేటలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ శాఖ అధికారులు ఆ ఖాతాను స్థంభింపజేశారు. అయితే తాను బ్యాంకును సంప్రదించగా అధికారులు సరిగా స్పందించలేదని ఇద్రీస్ చెబుతున్నారు. బ్యాంకు శాఖ అధికారులు సరైన వివరణ ఇవ్వలేదని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. గతంలో క్యాబ్ డ్రైవర్ (తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్) ఖాతాలో రూ. 9,000 కోట్లు బ్యాలెన్స్ ఉన్న ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత సదరు బ్యాంక్ పరిస్థితిని సరిదిద్దింది. అలాగే తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో రూ. 756 కోట్లు కూడా జమ అయినట్టుగా నివేదించిన సంగతి తెలిసిందే.




Updated : 9 Oct 2023 8:27 AM IST
Tags:    
Next Story
Share it
Top