Ram mandir : అయోధ్య రాముడి దర్శనానికి ఉచిత రైలు.. ఎక్కడి నుంచంటే..?
X
అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ భారతావని ఎదురు చూస్తోంది. జనవరి 22న జరగునున్న ఈ మహోత్కృష్ట కార్యానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రామ మందిర ప్రారంభోత్సవానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఛత్తీస్ఘఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య వెళ్లే భక్తుల కోసం ఉచిత రైలు నడపనుంది. సీఎం విష్ణు దేవ్ సాయి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ వార్షిక ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని ఆమోదించింది.
ఛత్తీస్ఘడ్ నుంచి బయలుదేరే ఈ రైలు ద్వారా ఏటా 20 వేల మందికి పైగా భక్తులు అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోనున్నారు. 18 నుంచి 75 ఏండ్ల వయసు ఉండి... ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులు. అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ ఈ స్కీం ఉపయోగించుకునే వీలు లేదు. ఛత్తీస్‌గఢ్ టూరిజం బోర్డు నిర్వహించే ఈ యాత్ర కోసం యాత్రికులను ఎంపిక చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో 55 ఏండ్లు పైబడిన వారిని ఎంపిక చేస్తారు. రాష్ట్ర పర్యాటక శాఖ నిధులతో ఈ రైలు నడపనున్నారు.
రాయ్‌పూర్, దుర్గ్, రాయ్‌ఘర్, అంబికాపూర్ స్టేషన్‌లలో రైలును ఎక్కవచ్చు. ఛత్తీస్ ఘడ్ - అయోధ్య మధ్య దూరం దాదాపు 900 కిలోమీటర్లు. కాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇటీవలే జనవరి 22ను డ్రై డేగా ప్రకటించింది.