అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన చిన్నారులు దొరికారు.
X
కారడవుల్లో అద్భుతం చోటుచేసుకుంది. కొలంబియాలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో 40 రోజుల క్రితం విమాన ప్రమాద సమయంలో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ఆచూకీ లభించింది. వారిని ప్రాణాలతో గాలింపు బృందాలు గుర్తించాయి. ఇన్ని రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా కనిపించడంతో కొలంబియాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. క్రూర మృగాల సంచరించే అమెజాన్ అడవుల్లో 40 రోజుల తర్వాత చిన్నారులు ప్రాణాలతో కనిపించడం ఆందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏం జరిగిందంటే...
సెస్నా 206 అని పిలవబడే తేలికపాటి విమానం మే 1న అరవాకువారా అటవీ ప్రాంతం నుంచి కొలంబియాలోని శాన్జోస్డెల్ గువియారే సిటీకి బయల్దేరింది. ఈ విమానం బయల్దేరిన కాసేపటికే మార్గమధ్యలో ఇంజన్లో సమస్య తలెత్తడంతో క్రాష్ అయ్యింది. దీంతో ఎయిర్ ప్లేన్ ఆచూకీ కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. మే 15న అమెజాన్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం శకలాలతో పాటు ముగ్గురు ప్రయాణికుల మృతదేహాలను సైన్యం కనిపెట్టంది.అయితే విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డల ఆచూకీ దొరక్కలేదు. దీంతో గత 40 రోజులుగా చిన్నారులు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
ప్రాణాలు నిలబెట్టింది ఇదే....
చిన్నారులు ప్రాణాలతో కనిపించడం వెనుక ఆర్మీ, అధికారులు చేసిన సేవ ఎంతో ఉంది. దాదాపు 200 మంది సైనికులు, జాగీలాలతో చిన్నారుల అమెజాన్ అడవిని జల్లెడపట్టారు. ఈ క్రమంలో మే 18వ తేదీన పిల్లలు క్షేమంగానే ఉన్నారని తెలియజేసేలా చిన్నగుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, పాలసీసా, సగం తిన్న పండు వంటివి కనిపించాయి. చిన్నారుల కాలిముద్రలు, ఆశ్రయం కోసం చేసుకున్న ఏర్పాట్లు కంటపడడంతో అడవుల్లోనే ఉన్నట్లు ధ్రువీకరించిన అధికారులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. గాలింపు సమయంలో భద్రతా సిబ్బంది అడవుల్లో అక్కడక్కడా హెలికాప్టర్ల సాయంతో ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను పడేశారు. అవే ఆ చిన్నారులకు సాయం చేశాయని అధికారులు భావిస్తున్నారు. ఎట్టకేలకు, ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత చిన్నారులను సజీవంగా గుర్తించారు.
ప్రయత్నాలు ఫలించాయి..
చిన్నారులను కనుగొన్న దృశ్యాలను ఆర్మీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘మా ప్రయత్నాలు ఫలించాయి’’ అని రాసుకొచ్చింది. ఈ దృశ్యాలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారు సజీవంగా బయటకు రావడంతో దేశ అధ్యక్షుడు పెట్రో సంతోషం వ్యక్తం చేశారు.