G20 summit : భారత్కు చైనా అధ్యక్షుడు రావట్లేదు..
X
ఢిల్లీలో ఈ నెల 9,10న జీ20 సదస్సు జరగనుంది. దీనికి సంబంధించి కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ దేశాల అధినేతలు రానుండడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సుకు హాజరుకావడం లేదని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు ప్రకటించగా.. తాజాగా చైనా అధ్యక్షుడూ రావడం లేదు.
జీ20 సదస్సుకు అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకావడం లేదని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆయన స్థానంలో ప్రధాని లీ చియాంగ్ ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపింది.‘‘భారత్ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ20 సదస్సులో ప్రధాని లీ చియాంగ్ పాల్గొంటారు. చైనా బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు’’ అని చైనా విదేశాంగ వివరించింది.
జిన్ పింగ్ రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిన్ పింగ్ రాకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. ఆయన్ని జీ20 సదస్సులో చూడాలనుకున్నట్లు చెప్పారు. అయితే, త్వరలోనే జిన్ పింగ్ను కలుస్తానని వివరించారు. మరోవైపు ఈ సదస్సును విజయవంతం చేసేందుకు భారత్ అన్నీ విధాల కృషి చేస్తోంది.