Viral News : 8వ తరగతి బాలుడి కిడ్నాప్.. ఆ తర్వాత ట్విస్ట్ మామూలుగా లేదుగా..
X
స్కూల్‌కు డుమ్మా కొట్టేందుకు పిల్లలు ఏవేవో సాకులు చెబుతుంటారు. కడుపు నొప్పి అని, కాలు నొప్పి అని బడి ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేస్తుంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ బాలుడు చేసిన పనికి అందరూ షాకయ్యారు. హోం వర్క్ చేయలేదని కిడ్నాప్ డ్రామా ఆడి అందరినీ పరుగులు పెట్టించాడు. చివరకు అదంతా ఉత్తదేనని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బిలాస్‌పుర్‌కు చెందిన ఒక బాలుడు స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. టీచర్ ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేయకపోవడంతో స్కూల్ కు వెళ్తే పనిష్మెంట్ ఇస్తారని భయపడ్డాడు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఓ ప్లాన్ వేశాడు. పాఠశాలకు బయలుదేరిన అతడు మళ్లీ ఇంటికి తిరిగొచ్చాడు. ఏమైందని పేరెంట్స్ అడగడంతో కట్టుకథ వినిపించాడు. మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చు మత్తుమందు వాసన చూపారని, దాంతో తాను స్పృహ కోల్పోయానని చెప్పాడు. వాళ్లిద్దరూ తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, అయితే వారి బైక్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయిందని, తనకు స్పృహ రావడంతో వెంటనే తప్పించుకుని వచ్చేశానని చెప్పాడు.
కొడుకు చెప్పిన విషయం నిజమేనని నమ్మిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడు చెప్పిన సమాచారం ఆధారంగా సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా అదంతా కట్టుకథ అని తేలింది. బాలుడిని గట్టిగా నిలదీయగా అసలు విషయం చెప్పాడు. హోమ్ వర్క్ చేయకపోవడంతో టీచర్ పనిష్మెంట్ ఇస్తుందన్న భయంతో కిడ్నాప్ డ్రామా ఆడానని చెప్పాడు. దీంతో అతని తల్లిదండ్రులతో పాటు పోలీసులు కంగుతిన్నారు. మళ్లీ ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించి పంపేశారు.