కాంగ్రెస్‌ను వణికిస్తున్న రెడ్ డైరీ.. సీఎంను జైలుకు పంపిస్తా..
X
రెడ్ డైరీ.. రెడ్ డైరీ! ఓ చిన్న ఎర్ర అట్టల పుస్తకం రాజస్తాన్‌తోపాటు దేశమంతా ఆసక్తిరేపుతోంది. కాంగ్రెస్ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. అందులో తమ చీకటి వ్యవహారాలు ఉన్నాయేమోనని అక్రమార్కులు హడలిపోతుంటే, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పార్టీకి ఆ పుస్తకం మరణశాసనం రాస్తుందేమోనని అధిష్టానం వణికిపోతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు నేతల అవినీతి బాగోతాలు అందులో వివరంగా ఉన్నాయంటున్న సొంత పార్టీ ఎమ్మెల్యేను దారికి తేవడం ఎలా అని బుర్ర చించుకుంటోంది.
మణిపూర్ మహిళల గొడవ కాదు, ముందు రాజస్తాన్ గొడవ చూసుకోవాలని కలకలం రేపి మంత్రి పోగొట్టుకున్న రాజేంద్ర గుడా ఈ పుస్తకాన్ని సోమవారం అసెంబ్లీకి పట్టుకొచ్చి కలకలం రేపారు. ఆ పుస్తకంలో సీఎం అండతో సాగుతున్న అవినీతి వివరాలు ఉన్నాయని బాంబు పేల్చారు. రూ.500 కోట్ల అక్రమాల వివరాలను రెడ్ డైరీలో రాసిపెట్టి ఉన్నాయని, దానిపై చర్చ జరగాలని పట్టుబడిన ఆయన రెడ్ డైరీని స్పీకర్ ముందు పెట్టారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేసి బయటికి గెంటేశారు. తర్వాత స్పీకర్ కూడా సస్పెండ్ చేశారు. ఆయనకు మద్దతిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్‌నూ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు.
రాజేంద్ర ఏమన్నారు?
రెడ్ డైరీని స్వయంగా ముఖ్యమంత్రి గెహ్లాటే తనకు ఇచ్చారని రాజేంద్ర చెప్పారు. కాంగ్రెస్ నేత, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మేంద్ర రాథోడ్ ఇళ్లలో ఇటీవల ఈడీ, ఐటీ అధికారులు దాడి చేసినప్పుడు గెహ్లాట్ రెడ్ డైరీని తనకిచ్చి దాచమన్నాడని రాజేంద్ర తెలిపారు. ‘‘తర్వాత ఆ డైరీ ఏదని నన్ను అడిగారు. అందులో ఏముందని చూడగా సీఎం, ఆయన కొడుకు వైభవ్, ఇతర కాంగ్రెస్ నేతల అవినీతి వివరాలు ఉన్నాయి. డైరీని రాసింది ధర్మేంద్ర రాథోడ్. ఎమ్మెల్యేలను కొనడానికి రూ. 2.5 కోట్లు ఇచ్చినట్లు అందులో రాశారు. డైరీ వివరాలు బయటికొస్తే అందరి బండారాలూ బయటపడతాయి. సీఎంను జైలుకు పంపిస్తా. డబ్బు తీసుకున్న ఎమ్మెల్యేలకు నార్కో పరీక్ష జరపాలి’’ అని రాజేంద్ర గుడా డిమాండ్ చేశారు. దాడి సమయంలో డైరీలో కొంత భాగాన్ని లాక్కున్నారని, డైరీలో మిగతా భాగం తన దగ్గరి ఉందని చెప్పారు. ఆయన ఆరోపణలు పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ యథావిధిగా కొట్టిపడేసింది. అయితే బీజేపీ ఆయనకు మద్దతు పలికింది.