కూరగాయల ధరలు పెరగడానికి ముస్లింలే కారణం.. సీఎం
X
టామాటా సహా పలు కూరగాయల ధరలు ముట్టుకుంటే చాలు భగ్గుమంటున్నాయి. ఆ మంటకు తోడు రాజకీయ నాయకులు పెట్టే మంట కూడా తోడై దృశ్యం రక్తి కడుతోంది. అస్సాం నగరాల్లో కూరగాయల ధరలు పెరడగానికి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన మియా ముస్లింలే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక అస్సామీలు కూరగాలయలు అమ్మి ఉంటే ధరలు ఇంతగా పరిగేవి కావన్నారు. ‘‘కూరగాయల ధరలు పల్లెల్లో తక్కువగా ఉన్నాయి. గువాహటి నగరంలో మాత్రం భారీగా పెంచారు. కూరగాయల వ్యాపారుల్లో, డ్రైవర్లలో ఆటో రిక్షాలు నడిపేవారిలో అత్యధికం బంగ్లా నుంచి వచ్చిన మియా ముస్లింలే’’ అని మండిపడ్డారు. మియా ముస్లింల వల్ల అస్సామీలకు, అస్సామీ సంస్కృతి సంప్రదాయాలను తీవ్ర విఘాతం కలుగుతోందని శర్మ తరచూ విమర్శిస్తున్నారు.
ఆయన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ప్రతి సమస్యకు ముస్లింలనే నిందించే వర్గం ఒకటి దేశంలో తయారైందని మండిపడ్డారు. ‘‘చివరికి గేదె పాలు ఇవ్వకపోయినా, కోళ్లు గుడ్డు పెట్టకపోయినా మియా ముస్లింలనే నిందిస్తారు. వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా ముస్లింలే కారణమంటారు. మన ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ముస్లింలతో మంచి స్నేహసంబంధాలు నెరుపుతున్నారు. వారిని టమాటాలు, బంగాళాదుంపలు, ఆకుకూరలు ఇవ్వాలని అడి సమస్యను పరిష్కరించాలి, ’’ ఓ ట్వీట్లో ఎద్దేవా చేశారు.