Liqour Scam : సీఎం కేజ్రీవాల్‌పై ఢిల్లీ కోర్టులో ఈడీ ఫిర్యాదు
X
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ స్పందించడం లేదని ఈడీ కోర్టుని వెళ్లింది. కాగా విచారణను కోర్టు ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే రాజకీయ కక్షతో తనపై ఈడీతో కేసులు పెట్టిస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మద్యం వ్యాపారులకు లైసెన్సులను మంజూరు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021 - 22 ఎక్సైజ్ ఎక్సైజ్ పాలసీని కార్టెలైజేషన్‌కు అనుమతించిందని , ఇందుకోసం లంచాలు చెల్లించిన కొంతమంది డీలర్లకు ఇది అనుకూలంగా వుందని ఈడీ ఆరోపించింది. ఈ అభియోగాలను పలుమార్లు ఆప్ ఖండించింది. ఈ పాలసీని తర్వాత రద్దు చేయగా.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణకు సిఫారసు చేశారు. అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ సమన్లు ఐదు సార్లు దాటవేశారు. ఈ 2023 సంవత్సరంలో నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో.. ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. సమన్ల పేరుతో తనను అరెస్టు చేసేందుకు చట్టవిరుద్ధమైన ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతీసారి ఆరోపించిన కేజ్రీవాల్.. ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మొదటి నుంచి ఈడీ సమన్లను పట్టించుకోని అరవింద్ కేజ్రీవాల్.. అవి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ రాజకీయ కక్షతోనే జారీ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని.. ఇప్పటికే పలుమార్లు ఆప్ నేతలతో కేజ్రీవాల్ చెప్పారు. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది.